రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పోర్టులు, షిప్‌యార్డులు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ మోడల్‌లో ప్రభుత్వం చేపట్టింది.
పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక రంగం, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి విభాగాల్లో పీపీపీ విధానంలో అమలు చేస్తున్న ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.1,23,229 కోట్లుగా ప్రభుత్వం గుర్తించింది.
పీపీపీ ప్రాజెక్టులను దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉండే విధంగా, సస్టైనబుల్ మోడల్‌లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశంలో సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించేలా ప్రాజెక్టుల రూపకల్పన, అమలు జరగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
సమీక్ష సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. పీపీపీ కింద కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత స్థితి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
రాష్ట్ర అభివృద్ధిలో పీపీపీ విధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులతో పాటు, భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులపై కూడా సమీక్షలో ప్రాథమిక చర్చ జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.







