రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు:
కళ్లద్దాలు పంపిణీకి ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 నుండి 18 ఏళ్ల వయస్సు గల విద్యార్థులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 43.30 లక్షల మంది విద్యార్థులను లక్ష్యంగా పెట్టుకుని వైద్యారోగ్యశాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా చర్యలు చేపట్టాయి.
జులై 15 నుంచి పాఠశాలలలోనే ఈ కంటి పరీక్షల కార్యక్రమం ప్రారంభం కానుందని అధికారిక సమాచారం. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి, సుమారు 2.50 లక్షల మందికి ఉచితంగా నాణ్యమైన కళ్లద్దాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. కంటి పరీక్షలతో పాటు విద్యార్థులకు కంటి సంరక్షణ, చదువుతప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగా ఉంది.
జాతీయ అంధత్వ నివారణ, దృష్టిలోప నియంత్రణ కార్యక్రమం భాగంగా రాష్ట్రంలో ఈ చర్యలు అమలు అవుతున్నాయి. పాఠశాలలకు వెళ్లే వయస్సులోనే దృష్టి సమస్యలను గుర్తించి, తగిన చికిత్స, సదుపాయాలు కల్పించడం ద్వారా భవిష్యత్తులో అంధత్వం కేసులను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.
కంటి పరీక్షల కోసం జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సంబంధిత శాఖలు వెల్లడించాయి. పాఠశాలలకు ముందస్తు షెడ్యూల్ పంపించి, విద్యార్థులందరినీ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. పరీక్షల సమయంలో గుర్తించిన దృష్టి లోపాల తీవ్రతను బట్టి, అవసరమైన వారికి కళ్లద్దాలు తయారు చేసి పాఠశాలల ద్వారానే పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులు, పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థుల ఆరోగ్యం, చదువులో ఏకాగ్రత, విద్యా ప్రగతిపై దృష్టి సమస్యలు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఈ కంటి పరీక్షల కార్యక్రమం ద్వారా పాఠశాల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతోంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలన్నింటిలోనూ ఈ కార్యక్రమాన్ని సమానంగా అమలు చేయాలని సంబంధిత శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దూర ప్రాంతాల్లోని పాఠశాలలకు కూడా వైద్య బృందాలు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల దృష్టి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







