రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్:
ఏపీలో ‘తల్లికి వందనం’ నిధుల విడుదలకు సిద్ధం… ఆధార్‌తోనే అర్హత చెక్ చేసుకునే సౌకర్యం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల విడుదలకు సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెలలో విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి కూడా నిధుల జమకు ముందే లబ్ధిదారుల అర్హతను ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
వేసవి సెలవులు ముగియడంతో ఏపీలో బడి గంట మోగింది. ప్రభుత్వ పాఠశాలలు తిరిగి తెరుచుకున్న తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు పంపిణీ చేశారు. ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకం ప్రకారం ఏడాదికి మొత్తం రూ.15 వేల ప్రయోజనం కల్పిస్తుండగా, అందులో స్కూళ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.2 వేల్ని వినియోగిస్తుంది. మిగిలిన రూ.13 వేల్ని విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ చేయనుంది.
ఇప్పటికే మరికొన్ని వారాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో పథకానికి అర్హత సాధించారా లేదా అన్నది తల్లిదండ్రులు ముందుగానే తెలుసుకునేలా ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధార్ నెంబర్ ఆధారంగా ఇంటి వద్ద నుంచే కొన్ని సెకన్లలో అర్హత స్థితిని తెలుసుకునే వీలు కల్పించారు.
విద్యార్థి ఈ పథకానికి అర్హుడిగా తేలితేనే తల్లిదండ్రుల ఖాతాలో నిధులు జమ అవుతాయి. ఒకవేళ అనర్హులుగా తేలితే నిధులు అందవు. అందుకే తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లల అర్హతను చెక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
ఆన్లైన్లో అర్హత తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రులు ముందుగా https:msgsw.ap.gov.in/BM/Appinstatus వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే ‘పథకం అర్హత’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త విండోలో లబ్ధిదారుడి ఆధార్ నెంబర్‌ను నమోదు చేయాలి. ఆ ఆధార్ నెంబర్‌కు అనుసంధానమైన మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత, లబ్ధిదారుడి కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఆ వివరాల వద్ద గ్రీన్ రంగులో ‘Satisfied’ అని కనిపిస్తే, ఆ కుటుంబం పథకానికి అర్హులుగా పరిగణించబడుతుంది. అదే రెడ్ రంగులో ‘Unsatisfied’ అని చూపిస్తే, ఆ కుటుంబం అనర్హుల జాబితాలోకి వెళ్తుంది. అనర్హులుగా తేలిన వారు తమ పరిధిలోని సచివాలయ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ విధానంలో తెలుసుకోవాలనుకునే తల్లిదండ్రుల కోసం కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ‘తల్లికి వందనం’ లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శించనున్నారు. సంబంధిత సచివాలయానికి వెళ్లి జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవచ్చు. జాబితాలో పేరు ఉంటే త్వరలో జమ కానున్న నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. పేరు లేకపోతే అక్కడి సచివాలయ సిబ్బందిని సంప్రదించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.







