అన్నమయ్య,: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లి మండలం జగన్ కాలనీలో భార్య దండామణిని ఆమె భర్త మధుకర్ రెడ్డి కత్తితో నరికి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న భార్యతో మధుకర్ రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆ తర్వాత పరిస్థితి విషమించి ఘర్షణకు దారి తీసినట్టు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

వివరాల ప్రకారం, భార్యతో జరిగిన గొడవలో మధుకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురై కత్తి తీసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో దండామణి అక్కడికక్కడే కుప్పకూలినట్టు స్థానికులు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న దండామణిని చూసిన పొరుగువారు ఒక్కసారిగా ఉలిక్కిపడి పోలీసులకు సమాచారం అందించారు.

సూచన అందుకున్న మదనపల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు.

మధుకర్ రెడ్డి పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో నమోదైన ఒక క్రిమినల్ కేసులో అతడు పదేళ్లపాటు జైలు శిక్ష అనుభవించినట్టు అధికారులు తెలిపారు. సుమారు 15 రోజుల క్రితమే జైలు నుంచి విడుదలై మదనపల్లికి తిరిగి వచ్చిన మధుకర్ రెడ్డి, భార్య దండామణితో తరచూ గొడవపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు.

హత్యకు గల ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి దారితీసిన అవకాశాన్ని వారు పరిశీలిస్తున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. మధుకర్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయని, అతడి అరెస్టు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.