రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని వీరబల్లి మండలం దిగువరాచపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వంగిమళ్ళ పెద్దూరు కస్పాలో గ్రామ రహదారి తీవ్రంగా దెబ్బతింది. అప్పుడప్పుడు కురిసే వర్షాల కారణంగా నడిరోడ్డు మీదకు వర్షపు నీరు చేరి, రహదారి మొత్తం చెరువులా మారిపోయే స్థితి నెలకొంది. రహదారి పై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు పలుమార్లు పాలకులకు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గ్రామ రహదారి దుస్థితి పై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో కువైట్లో ఉద్యోగం చేస్తూ, ఇటీవల స్వగ్రామానికి వచ్చిన యువకుడు షేక్ నౌషద్ అలీ ముందుకొచ్చి రహదారి మరమ్మతు పనులను స్వయంగా చేపట్టాడు. సోమవారం తన సొంత ఖర్చులతో జెసిబి, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి, ఎర్ర మట్టి తోలించి దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాడు.
రహదారి పై ఉన్న గుంతలను పూడ్చి, సమంగా మట్టి పరచడంతో వాహనాల రాకపోకలకు సౌలభ్యం కలిగింది. గ్రామస్తులు రోజువారీ ప్రయాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు కొంతవరకు తొలగిపోయాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన పనిని ఒక సాధారణ యువకుడు ముందుకొచ్చి తన సొంత నిధులతో చేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.

గ్రామ రహదారి మరమ్మతు పనులు పూర్తయ్యాక, గ్రామస్తులు షేక్ నౌషద్ అలీని అభినందించారు. యువకుడి సేవాభావం, గ్రామంపై ఉన్న అనుబంధం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో సంవత్సరాలుగా వాయిదా పడుతున్న రహదారి సమస్యను స్వయంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన నౌషద్ అలీ చర్యకు గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో నౌషద్ అలీ చర్య మరోసారి స్పష్టంచేసిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికార యంత్రాంగం స్పందించకపోయినా, గ్రామం కోసం వ్యక్తిగతంగా ముందుకొచ్చే యువత ఉంటే సమస్యల పరిష్కారం సాధ్యమని గ్రామస్తులు అంటున్నారు.













