రాయలసీమ న్యూస్, అన్నమయ్య: రాయచోటిః తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్ రవినాయుడు, MLA ఆరని శ్రీనివాసులు, MLC సోమిరెడ్డి చంద్రమోహన్ హాజరయ్యారు.
కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 26 జిల్లాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో 12 క్రీడాంశాల్లో 2.07 లక్షల మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం విశేషంగా నిలిచింది.
విజేతలు, రన్నర్లను ప్రోత్సహించేందుకు మొత్తం రూ.91.90 లక్షల ప్రైజ్ మనీ అందజేశారు. రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించే అవకాశం లభించినట్లు కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని క్రీడా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన వివరించారు.
క్రీడాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించే ప్రతిపాదనపై ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి చెప్పారు. నెల్లూరు పరిసర ప్రాంతాల్లో సుమారు వెయ్యి ఎకరాల భూమిలో స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా క్రీడా సామగ్రి తయారీ, సరఫరా రంగాల్లో రాష్ట్రానికి కొత్త అవకాశాలు లభిస్తాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రీడా కార్యక్రమానికి Asia Book of Recordsలో గుర్తింపు లభించడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలు రాష్ట్ర ప్రతిష్ఠను దేశ, విదేశాల్లో మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.













