రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
కోర్టు మెట్లెక్కిన ‘డాన్ 3’ : FWICEకు రణ్‌వీర్ సింగ్ లీగల్ నోటీసు
బాలీవుడ్‌లో సంచలనం రేపుతున్న ‘డాన్ 3’ వివాదం మరింత ముదురుతోంది. ఈ వివాదం తాజాగా న్యాయపరమైన మలుపు తిరిగింది. తనపై నిషేధం విధించిన ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) సంస్థకు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ నోటీసుల పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
రణ్‌వీర్ సింగ్‌పై FWICE విధించిన నిషేధం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. FWICE చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్ తమకు రణ్‌వీర్ తరఫున నోటీసులు అందిన విషయాన్ని ధృవీకరించారు. ఈ అంశంపై ఈరోజు సాయంత్రం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ ప్రెస్‌మీట్‌లో ఏమి వెల్లడిస్తారనే దానిపై బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.
ఈ వివాదానికి కారణమైన ‘డాన్ 3’ ప్రాజెక్ట్ మొదట నుంచే బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసింది. నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అక్తర్ రూపొందించాలనుకున్న ఈ చిత్రంలో హీరోగా రణ్‌వీర్ సింగ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే మధ్యలో రణ్‌వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగారు. ఆయన వైదొలగిన తీరు, కారణాలపై వివిధ రకాల ఊహాగానాలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో రణ్‌వీర్ చర్చలకు సహకరించలేదని, నిర్మాతలు భరించిన నష్టంపై వివాదం తలెత్తిందని FWICE ప్రకటించింది. నిర్మాతలకు ప్రీ ప్రొడక్షన్ దశలోనే సుమారు రూ.45 కోట్ల నష్టం వాటిల్లిందని, ఆ నష్టపరిహారం విషయంలో నిర్మాణ సంస్థతో ఉన్న వివాదాన్ని పరిష్కరించుకునే వరకూ రణ్‌వీర్‌తో కలిసి పని చేయవద్దని సభ్యులకు ఆదేశిస్తూ FWICE ఇటీవల ప్రకటన జారీ చేసింది.
FWICE నిర్ణయంపై రణ్‌వీర్ సింగ్ టీమ్ స్పందించింది. రణ్‌వీర్‌కు తన వృత్తిపై అపారమైన గౌరవం ఉందని, తాను చేసే ప్రతి ప్రాజెక్ట్ విజయవంతం కావాలని కోరుకుంటారని టీమ్ స్పష్టం చేసింది. ఈ వివాదంపై ఆయన మౌనం కూడా అదే దృష్టితోనేనని, ప్రొఫెషనల్ కమిట్‌మెంట్లను గౌరవించే వ్యక్తిగా రణ్‌వీర్ వ్యవహరిస్తున్నారని టీమ్ పేర్కొంది.
ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసిన ఈ కేసు, రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసులతో మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. సాయంత్రం ముంబయిలో జరగనున్న FWICE సమావేశం తర్వాతి న్యాయపరమైన చర్యలు ఈ వివాదానికి ఏ దిశగా మలుపు తిప్పుతాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.













