రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
2035 నాటికి 10 GW అణు విద్యుత్ లక్ష్యం
: గౌతమ్ అదానీ
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడమే లక్ష్యంగా 2035 నాటికి 10 గిగావాట్ల అణుశక్తి (GW) సామర్థ్యాన్ని సాధించాలని అదానీ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam adani) వెల్లడించారు. ‘అదానీ అటామిక్ ఎనర్జీ’ ద్వారా తమ గ్రూప్ అణుశక్తి రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలో (Adani group AGM) ప్రసంగించిన ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
న్యూక్లియర్ పవర్ వెంచర్ కోసం ఇప్పటికే భూమిని గుర్తించామని గౌతమ్ అదానీ తెలిపారు. భారతదేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఈ పెట్టుబడులు సహాయపడతాయని పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తుందని తెలిపారు. థర్మల్, పునరుత్పాదక, హైడ్రో, గ్యాస్ వంటి కీలక ఇంధన రంగాల్లో ఈ సంస్థ పెట్టుబడులను వేగవంతం చేస్తున్న వేళ ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ రూ.1.5 లక్షల కోట్లు మౌలిక వసతుల కల్పనపై ఖర్చు చేసిందని గౌతమ్ అదానీ తెలిపారు. ప్రైవేటు రంగ పెట్టుబడుల్లో 30 శాతం వాటా అదానీ గ్రూప్‌దేనని పేర్కొన్నారు. తమ కంపెనీపై కొందరు సందేహాలను సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ.. వాటాదారులు వాటిని సమర్థంగా తిప్పికొట్టారంటూ పరోక్షంగా హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో రైట్స్ ఇష్యూ ద్వారా రూ.25 వేల కోట్లు సమీకరించామని, కంపెనీపై ఉన్న విశ్వసనీయతకు ఇది నిదర్శనమన్నారు.
అదానీ టోటల్ గ్యాస్ పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ల సంఖ్య 11 లక్షల మార్కు దాటిందని గౌతమ్ అదానీ ఈ సందర్భంగా వెల్లడించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అదానీ పోర్ట్స్ 500 మిలియన్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేసిందన్నారు. 2030 నాటికి 1 బిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.
నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం, గువాహటి విమానాశ్రయంలో కొత్త టెర్మినల్‌ను ప్రారంభించామని, విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని ఏజీఎం వేదికగా తెలిపారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ సంయుక్తంగా రూ.2.92 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని గౌతమ్ అదానీ తెలిపారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.4 శాతం అధికమని పేర్కొన్నారు. పన్ను అనంతర లాభం 13.9 శాతం వృద్ధితో రూ.46,376 కోట్లకు చేరిందని తెలిపారు.
అదానీ గ్రూప్ సామర్థ్యాన్ని ఈ నంబర్లు తెలియజేస్తాయని గౌతమ్ అదానీ పేర్కొన్నారు. దేశ కీలక మౌలిక వసతుల రంగాల్లో భవిష్యత్ పెట్టుబడుల ప్రణాళికలకు అవసరమైన ద్రవ్య లభ్యతను, నమ్మకాన్ని ఈ నంబర్లు అందిస్తున్నాయని గౌతమ్ అదానీ తెలిపారు.







