దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, వడ్డీ రేట్ల పెంపు ఇప్పట్లో ఉండకపోవచ్చన్న ఆర్‌బీఐ గవర్నర్‌ సంకేతాలు సూచీలకు కలిసొచ్చాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మరింత పతనం కావడం, విదేశీ మదుపర్లు కొనుగోళ్ల వైపు ఉండడమూ పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో 900 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 24 వేల మార్కు దాటింది. మదుపర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పెరిగింది.

సెన్సెక్స్‌ ఉదయం 76,229.76 పాయింట్ల (క్రితం ముగింపు 76,200.68) వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 77,190.37 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికు 790.54 పాయింట్ల లాభంతో 76,991.22 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 197.55 పాయింట్ల లాభంతో 24,021.65 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 94.65గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండిగో, ట్రెంట్‌, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్‌, మారుతీ సుజుకీ, బీఈఎల్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్లకు చేరగా.. ఔన్సు బంగారం ధర 4,060 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కారణాలు ఇవే..

  • వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా చెక్‌ పెట్టారు. ప్రస్తుత దశలో వడ్డీ రేట్ల పెంపు గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందని పేర్కొన్నారు. ఓ ఆంగ్ల టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. చమురు ధరల ప్రభావం, ద్రవ్యోల్బణాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. వడ్డీ రేట్ల సవరణ ఉంటే ముందుగానే మార్కెట్‌ను అందుకు సిద్ధం చేస్తామని తెలిపారు.

  • నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి సూచీ 10 శాతం పతనం కావడం, ఇతర ప్రపంచ మార్కెట్‌లు కూడా అమ్మకాల ఒత్తిడి కారణంగా మన మార్కెట్‌లు నష్టాలు చవిచూశాయి. నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో కోస్పి సూచీ తిరిగి పుంజుకోవడం, ఇతర మార్కెట్లూ రాణించడంతో మన మార్కెట్‌పై ఆ ప్రభావం పడింది.

  • భారత్, అమెరికాల మధ్య చరిత్రాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందనే వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. దీనికితోడు ముడిచమురు ధరలు నాలుగు నెలల కనిష్ఠానికి చేరాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే మన దేశానికి ఊరట కల్పించే అంశం కావడంతో సూచీలు పరుగులు పెట్టాయి.

  • గత కొన్ని రోజులుగా అమ్మకాల వైపు ఉంటున్న విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) వరుసగా మూడో సెషన్‌లోనూ కొనుగోళ్లు జరపడం పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమైంది. దీనికితోడు టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ, బ్యాంకింగ్‌ షేర్లు సూచీలకు అండగా నిలిచాయి.