దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ జియో, ఇప్పుడు అంతరిక్ష కమ్యూనికేషన్‌ రంగంపై దృష్టి సారించింది. శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌, డైరెక్ట్‌ టు డివైస్‌ సేవలు అందించేందుకు లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయాలని కంపెనీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఆంగ్ల పత్రికల సమాచారం ప్రకారం, రాబోయే రెండుమూడు సంవత్సరాల్లో భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో 1,600–1,650 శాటిలైట్లను ప్రయోగించి, దేశవ్యాప్తంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌, డైరెక్ట్‌ టు డివైస్‌ సేవలను అందించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (In-Space)కు జియో ఇప్పటికే సాంకేతిక నిర్మాణ ప్రతిపాదనలు సమర్పించింది. సంబంధిత అధికారులు ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే, ప్రస్తుతం విదేశీ సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్న లో ఎర్త్‌ ఆర్బిట్‌ శాటిలైట్‌ విభాగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ సంస్థగా రిలయన్స్‌ జియో నిలిచే అవకాశం ఉంది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా విదేశీ శాటిలైట్‌ ఆపరేటర్లపై ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌కు చెందిన Starlink వంటి విదేశీ సంస్థలు దేశంలో కఠినమైన నిఘా, నియంత్రణలను ఎదుర్కొంటున్నాయి.

జియో ప్రణాళిక ప్రకారం శాటిలైట్‌ కాన్‌స్టెలేషన్‌ నిర్మించాలంటే 10–15 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.95,000–1.42 లక్షల కోట్లు) మధ్య భారీ పెట్టుబడులు అవసరమవుతాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌ ద్వారా కొన్ని టెరాబిట్‌ల స్థాయిలో హై స్పీడ్‌ డేటా సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

ఈ రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ITU) ఫైలింగ్స్‌ ద్వారా అంతరిక్షంలో జియోకు అవసరమైన ఆర్బిటల్‌ స్లాట్‌లు దక్కేలా కేంద్ర ప్రభుత్వం సహకరించనుందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రంగంలోకి అడుగుపెట్టే ఇతర భారతీయ కంపెనీలకూ ఇలాంటి మద్దతు లభించే అవకాశముంది.

కొత్త శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ వ్యాపారాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సాంకేతిక విభాగమైన Jio Platforms కింద నిర్వహించనున్నారు. త్వరలోనే Jio Platforms పబ్లిక్‌ ఇష్యూ ద్వారా మూలధన మార్కెట్‌లోకి రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం అంతర్జాతీయంగా లో ఎర్త్‌ ఆర్బిట్‌ విభాగంలో పలు దిగ్గజ సంస్థలు పెద్ద ఎత్తున ఉపగ్రహాలను ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్ ప్రాజెక్ట్ Kuiper మొత్తం 3,200 శాటిలైట్లను లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 300కు పైగా ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. Eutelsat OneWeb 654 శాటిలైట్లతో సేవలు అందిస్తోంది. ఈ విభాగంలో స్టార్ లింక్ అత్యంత ప్రధాన సంస్థగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జియో ప్రవేశం భారతీయ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ రంగానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.