పాలీమర్‌ కరెన్సీ నోట్లు ప్రవేశపెట్టే అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ నోట్లను చలామణిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. కాగితపు కరెన్సీకి ఉన్న అధిక వినియోగం, ముద్రణ వ్యయం, నోట్లు చేతులు మారే కొద్దీ త్వరగా పాడైపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్‌ కరెన్సీ నోట్ల ఆలోచనను ఆర్‌బీఐ దాదాపు పదేళ్ల క్రితమే ముందుకు తీసుకువచ్చింది. అప్పట్లో పాలీమర్‌ నోట్ల ప్రయోజనాలు, మన్నికపై అధ్యయనం చేసి, ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే దిశగా కేంద్రం ప్రణాళికలు రూపొందించింది.

దేశవ్యాప్తంగా ట్రయల్‌ పద్ధతిలో రూ.10 విలువ కలిగిన ఒక బిలియన్‌ ప్లాస్టిక్‌ నోట్లను చలామణిలోకి తీసుకురావాలని ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలియజేసింది. ఇందుకోసం కొచ్చి, మైసూర్‌, జైపుర్‌, శిమ్లా నగరాలను ఎంపిక చేసింది. అయితే సాంకేతిక, కార్యాచరణ సంబంధిత పలు సమస్యల కారణంగా ఆ ప్రణాళిక అమలులోకి రాలేదు.

ఇదిలా ఉండగా, మార్కెట్‌లో నకిలీ నోట్ల చలామణి స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడం, కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం లక్ష్యంగా ఆర్‌బీఐ కొత్త చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నోట్లలో అదనపు భద్రతా లక్షణాలను ప్రవేశపెట్టడంతో పాటు, వార్నిష్డ్‌ కరెన్సీ నోట్లను కూడా చలామణిలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో ఆర్‌బీఐ ఈ అంశాన్ని ప్రస్తావించింది. పలుచని, రక్షిత అల్ట్రా వయొలెట్‌ క్యూర్‌డ్‌ వార్నిష్‌ పూత పూయబడిన కాగితపు నోట్లను వార్నిష్డ్‌ కరెన్సీగా పిలుస్తారు. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే ఇవి ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. తరచూ నోట్లు పాడైపోవడం వల్ల కొత్త నోట్లు ముద్రించేందుకు ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడంలో వార్నిష్డ్‌ నోట్లు ఉపయోగపడతాయని నివేదికలో పేర్కొంది. సాధారణ నోట్ల కంటే ఈ నోట్లు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ కాలం చలామణిలో ఉండగలవని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. నకిలీ నోట్ల నిరోధం, ముద్రణ వ్యయ నియంత్రణ, నోట్ల మన్నిక పెంపు లక్ష్యాలతో పాలీమర్‌, వార్నిష్డ్‌ కరెన్సీపై ఆర్‌బీఐ దశలవారీగా పరిశీలన కొనసాగిస్తోంది.