రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులపై గందరగోళం
ప్రభుత్వంతో చర్చలేంటన్న మస్క్ సంస్థ
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ, స్టార్‌లింక్ సేవల తుది అనుమతులపై అనిశ్చితి నెలకొన్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దేశంలో సేవలు ప్రారంభించేందుకు అవసరమైన తుది క్లియరెన్స్‌ను భారత ప్రభుత్వం నిలిపివేసిందన్న వార్తలు వెలువడుతున్నాయి.
ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ తరఫున అధికారిక స్పందన వచ్చింది. భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని, అనుమతుల ప్రక్రియలో సంస్థ పారదర్శకంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేసింది. ఈ మేరకు స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.
స్టార్‌లింక్ తుది క్లియరెన్స్‌ను ప్రభుత్వం హోల్డ్‌లో ఉంచిందన్న వార్తల వెనుక పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం ఉన్నట్టు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇరాన్ యుద్ధంలో స్టార్‌లింక్ టెర్మినళ్ల వినియోగంపై వచ్చిన కథనాలు, ఆ దేశం నుంచి ఎలాంటి లైసెన్సులు పొందలేదన్న సమాచారం నేపథ్యంలో భద్రతా అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
భారత్ భద్రతా అవసరాలకు విరుద్ధంగా ఏదైనా విదేశీ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వచ్చినప్పుడు, మస్క్ కంపెనీ ఎలా స్పందిస్తుందనే అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. గతంలో టెలికాం అధికారులకు స్టార్‌లింక్ భద్రతా అంశాలపై సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ, మరింత స్పష్టత అవసరమని అధికారులు భావిస్తున్నారని తెలుస్తోంది.
ఎలాన్ మస్క్‌కు చెందిన SpaceX అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ఇప్పటికే పలు దేశాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సంప్రదాయ భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సేవలకంటే భిన్నంగా, లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాల ద్వారా సేవలు అందించడం స్టార్‌లింక్ ప్రత్యేకత. భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో స్టార్‌లింక్‌కు చెందిన దాదాపు 6,000 ఉపగ్రహాలు కక్ష్యలో పరిభ్రమిస్తున్నాయి.
భూమికి తక్కువ దూరంలో ఉండే ఈ ఉపగ్రహాల కారణంగా లేటెన్సీ తగ్గి, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతున్నాయని సంస్థ పేర్కొంటోంది. మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను అధిగమించేందుకు స్టార్‌లింక్ సేవలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. భారత్‌లో కూడా ఇలాంటి ప్రాంతాల కోసం స్టార్‌లింక్ సేవలు కీలకంగా మారే అవకాశముండటంతో, తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఏదన్న దానిపై దృష్టి కేంద్రీకృతమైంది.







