దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రెండో రోజూ మంగళవారం కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ వంటి ఐటీ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు దోహా వేదికగా ఇరాన్‌- అమెరికా మధ్య శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు మాత్రం రాణించాయి. సెన్సెక్స్‌ 249 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయింది.

సెన్సెక్స్‌ ఉదయం 77,005.51 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,728.37) నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 77,037.36 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. 76,329.39 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 249.70 పాయింట్ల నష్టంతో 76,478.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 80.50 కోల్పోయి 23,865.75 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో మారుతీ, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్స్, ఎటర్నెల్‌, అదానీ పోర్ట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ లాభపడ్డాయి. ఐటీసీ, హిందూస్థాన్‌లీవర్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 94.66గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.21 డాలర్లుగా ఉండగా.. బంగారం ఔన్సు 4,025.73 వద్ద కొనసాగుతోంది.