చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షల ముఠా బహిర్గతం

చిత్తూరు: చట్టపరంగా నిషేధితమైన లింగ నిర్ధారణ పరీక్షలు చిత్తూరు జిల్లాలో వ్యవస్థాగతంగా కొనసాగుతున్నట్టు వెలుగులోకి వచ్చింది. గతేడాది మే 14న చిత్తూరులోని భరత్‌నగర్‌ కాలనీలో ఓ రేకుల ఇంట్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ 11 మంది గర్భిణులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

ప్రాథమిక విచారణలో వారానికి 50 మందికిపైగా గర్భిణులపై లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తేలింది. ఈ కేంద్రానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అక్కడ మహిళా నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో నలుగురిని పట్టుకుని నోటీసులు జారీ చేసి వదిలేశారు.

లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ప్రభుత్వ యంత్రాంగం పదేపదే హెచ్చరిస్తున్నా, కొందరు డబ్బు ఆశతో ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో బయటపడింది. గర్భంలో పిండం ఆడ శిశువుగా గుర్తిస్తే, పుట్టకముందే గర్భవిచ్ఛితీ చేయించే ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ పనులు నిపుణులైన వైద్యులు చేస్తున్నారనుకోవడం పొరపాటే అని అధికారులు చెబుతున్నారు. ఈ ముఠాల్లో పాల్గొంటున్న నిర్వాహకులు చాలామంది పదో తరగతి లేదా అంతకంటే తక్కువ చదువుతోనే ఈ అక్రమ వ్యాపారంలోకి వచ్చారని విచారణలో తేలింది.

చిత్తూరు జిల్లాలో ఇటీవల పట్టుబడిన రెండు ఘటనల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నడిపిన నిర్వాహకులు పదో తరగతి లేదా ఆలోపే చదివినవారేనని పోలీసులు గుర్తించారు. వీరిలో కొందరు గతంలో స్కానింగ్‌ సెంటర్లు లేదా ల్యాబ్‌లలో పనిచేసి, అక్కడి అనుభవంతో కొన్నేళ్లుగా ఈ దారిలోకి మళ్లినట్టు సమాచారం. ఉన్నత చదువులు లేదా ప్రాక్టీస్‌ కోసం ఇతర ప్రాంతాలు, విదేశాలకు వెళ్లే ఆసుపత్రుల వైద్యుల నుంచి సుమారు రూ.లక్షకు పాత స్కానింగ్‌ యంత్రాలను కొనుగోలు చేసి అక్రమ కేంద్రాలు నడుపుతున్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.

గతంలో తమ వద్దకు వచ్చిన గర్భిణులు, వారి బంధువులను ముందుగా సంప్రదించి రప్పించడం, లేకపోతే ఆర్‌ఎంపీలు, ల్యాబ్‌ నిర్వాహకులు, కొన్నిసార్లు గర్భిణులను తరలించే ఆటో డ్రైవర్ల ద్వారా కూడా మహిళలను ఈ కేంద్రాలకు తీసుకువస్తున్నట్టు అధికారులు తెలిపారు. అన్ని అనుమతులు ఉన్న చట్టబద్ధ కేంద్రాలేనని నమ్మబలికి, ఒక్కో గర్భిణి నుంచి లింగ నిర్ధారణ పరీక్షకు రూ.8వేలు నుంచి రూ.10వేలు వరకు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ముఠాల నెట్‌వర్క్‌ చిత్తూరు జిల్లాతోపాటు పొరుగు రాష్ట్రాల వరకూ విస్తరించింది. దామలచెరువు నుంచి బెంగళూరు వరకు, సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని నమక్కల్‌ వరకు కూడా ఈ ముఠా ప్రభావం ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. పాకాల, దామలచెరువు, చంద్రగిరి, పలమనేరు, మదనపల్లె, పుంగనూరు, తమిళనాడులోని విల్లుపురం, తిరువణ్నామలై, వేలూరు, కర్ణాటకలోని ముళబాగిలు, బెంగళూరు, కోలారు తదితర ప్రాంతాల నుంచి గర్భిణులను తీసుకువస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

వైద్య శిబిరాల తరహాలో వారం లేదా 15 రోజులకోసారి ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్టు సమాచారం. నిపుణులైన వైద్యుల్లా ప్రవర్తిస్తూ, ఏ మాత్రలు వాడాలి, ఏ అబార్షన్‌ కిట్లు వినియోగించాలి అనే వివరాలు చెబుతున్నట్టు బాధితులు వెల్లడించినట్టు తెలుస్తోంది. గర్భధారణ నిర్ణీత వ్యవధి దాటితే గర్భవిచ్ఛితీ చేయించేందుకు ఏర్పాట్లు చేసి, ఇందుకోసం ఒక్కో కేసుకు రూ.20వేలు నుంచి రూ.50వేలు వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ ముఠాలను పూర్తిగా అణచివేయడానికి కఠిన చర్యలు కొనసాగుతున్నాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.