చిత్తూరు కలెక్టరేట్‌లో దారుణం:

దివ్యాంగురాలు ఆత్మహత్యాయత్నం కలకలం

చిత్తూరు:- చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన దివ్యాంగురాలు మనెమ్మ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. వివరాలు పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగురాలు మనెమ్మకు కొన్నేళ్ల కిందట చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం ఉప్పరపల్లికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఉద్యోగం దక్కకపోవడం తో ,అయినా చిన్నచిన్న పనులు చేస్తూ ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటోంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఏఎన్‌ఎం పోస్టులు ఉన్నాయని తెలుసుకొని.. దరఖాస్తు చేసుకుంది. అన్ని అర్హతలున్నా నాన్‌ లోకల్‌ పేరుతో తనకు ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ) అలసత్వం వల్లే తనకు అన్యాయం జరిగిందని మనెమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. నాన్‌ లోకల్‌ కేటగిరి గురించి స్పష్టం చేయకుండా దరఖాస్తు స్వీకరించారని వాపోయింది. తీరా ప్రక్రియ ముగిశాక అసలు విషయం చెప్పారని కన్నీటిపర్యంతమైంది. ఈ నిబంధన ముందే చెప్పి ఉంటే తన సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకునేదానినని వాపోయింది. న్యా­యం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో సోమవారం నాలుగేళ్ల కుమార్తెతో వచ్చి కలెక్టర్‌ సుమిత్‌ను కలిసి తన ఆవేదన చెప్పుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని కలెక్టర్‌ చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన మనెమ్మ చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద ఒంటిపై పెట్రోల్‌ పోసుకోని , కొంత పెట్రోల్‌ను తాగేసింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను పోలీసులు, స్థా­ని­కులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.