రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లా పోలీసు శాఖకు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హీరో మోటోకార్ప్ లిమిటెడ్ 66 విడా ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలను అందజేసింది. మహిళల భద్రతను బలోపేతం చేయడంతో పాటు, పోలీసుల అత్యవసర స్పందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి.
జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు బుధవారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందికి ఈ ఎలక్ట్రిక్ బైక్‌లను అందజేశారు. అనంతరం మహిళా పోలీసులతో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సిబ్బందికి హెల్మెట్లు, ప్రథమ చికిత్స కిట్లు, టీ షర్టులు కూడా పంపిణీ చేశారు.
కార్యక్రమం అనంతరం అధికారులు మాట్లాడుతూ, మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడం, కమ్యూనిటీ పోలీసింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం, పర్యావరణ హిత రవాణాను ప్రోత్సహించడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు సూచనల మేరకు హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అందజేసిందని తెలిపారు. ఇటీవలి శ్రీసిటీ పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు సమక్షంలో ఎస్పీ సుబ్బరాయుడు ఈ వాహనాలను స్వీకరించినట్లు గుర్తుచేశారు.
జిల్లాలోని 53 పోలీస్ స్టేషన్లకు ఒక్కో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కేటాయించనున్నట్లు అధికారులు వివరించారు. మిగిలిన 13 వాహనాలను మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసు విభాగాలకు అప్పగించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాల వినియోగంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై మరింత వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో పర్యావరణ హిత రవాణా వినియోగాన్ని పెంచేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని, ఇంధన వ్యయాన్ని తగ్గించడంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు అభిప్రాయపడ్డారు. మహిళా పోలీసు సిబ్బంది ఈ వాహనాల ద్వారా పహారా విధులు, అవగాహన కార్యక్రమాలు, అత్యవసర సేవలను మరింత చురుకుగా నిర్వహించగలరని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు, రవి మనోహరాచారి, శ్రీలత, డీఎస్పీ గీతాకుమారి, హీరో మోటోకార్ప్ ప్లాంట్ హెడ్ ఎస్. ప్రభు, హెచ్‌ఆర్ హెడ్ మనోహర చక్రవర్తి, అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ హెడ్ కిరణ్, హీరో మోటార్స్ షోరూమ్ ప్రతినిధి పృథ్విరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













