రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లా విజయపురం మండలంలోని ఇల్లత్తూరు హరిజనవాడలో యువతి అనుమానాస్పద మృతి కేసు హత్యగా తేలింది. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ రాత్రి నిరోషా (26) అనే వివాహిత ఇంట్లో మృతి చెందగా, మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
సీఐ భాస్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరోషాకు గతంలో కార్తిక్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. ఒంటరిగా జీవిస్తున్న నిరోషాకు వరుసకు అత్త కుమారుడైన నాగరాజుతో సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఈ మధ్యకాలంలో తిరువళ్లూరుకు చెందిన వసంత్ అనే యువకుడు నిరోషాకు పరిచయమయ్యాడు.
వసంత్‌ను పెళ్లి చేసుకుంటానని నిరోషా చెప్పడంతో నాగరాజు అసహనం వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆమెతో గొడవలకు దిగినట్లు పోలీసులు తెలిపారు. తనకే పెళ్లి చేసుకోవాలని నాగరాజు నిరోషాపై ఒత్తిడి తెస్తున్నాడని విచారణలో బయటపడింది. ఈ క్రమంలో ఘటన జరిగిన రోజు రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఆ రాత్రి వసంత్‌నే పెళ్లి చేసుకుంటానని నిరోషా మరోసారి స్పష్టంగా చెప్పడంతో నాగరాజు ఆగ్రహానికి గురయ్యాడు. కోపావేశంలో నిరోషా గొంతు నులిమి, ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ హీటర్ తీగను ఆమె మెడకు చుట్టి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. అనంతరం అక్కడి నుంచి పరారైన నాగరాజును శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన నాగరాజును కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ భాస్కర్ తెలిపారు. కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసు విచారణలో విజయపురం, నిండ్ర పోలీస్ స్టేషన్ల ఎస్సైలు వెంకటసుబ్బయ్య, మల్లికార్జున్ సహా సిబ్బంది పాల్గొన్నారు. పెళ్లి సంబంధం విషయంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు కారణమయ్యాయని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.













