మాంచెస్టర్‌ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా, టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే తన దూకుడు చూపించింది. శనివారం జరిగిన తొలి గ్రూప్‌ మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను 65 పరుగుల తేడాతో చిత్తు చేసి శక్తివంతమైన ఆరంభం చేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్లు బెత్‌ మూనీ (7), జార్జియా వోల్‌ (0) విఫలమయ్యారు. స్టార్‌ బ్యాటర్‌ ఆష్లీ గార్డ్‌నర్‌ (1) కూడా నిలదొక్కుకోలేకపోయినా, మధ్యవరుసలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, ఎలీస్‌ పెర్రీ, జార్జియా వేర్‌హామ్‌ దూకుడైన ఇన్నింగ్స్‌తో జట్టును భారీ స్కోరు వైపు నడిపించారు.

ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 24 బంతుల్లో 9 బౌండరీలు, ఒక సిక్సర్‌తో అర్ధశతకం (50) నమోదు చేసింది. అనుభవజ్ఞురాలు ఎలీస్‌ పెర్రీ 26 బంతుల్లో 4 బౌండరీలతో 36 పరుగులు సాధించింది. చివర్లో జార్జియా వేర్‌హామ్‌ 22 బంతుల్లో 6 బౌండరీలతో 32 పరుగులు చేసి స్కోరు వేగంగా ముందుకు తీసుకెళ్లింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంలబా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. అయబోంగా ఖకా కూడా 4 ఓవర్లలో 33 పరుగులకు 2 వికెట్లు పడగొట్టింది.

173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ విభాగం ఆస్ట్రేలియా బౌలింగ్‌ ముందు పూర్తిగా తడబడింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన జార్జియా వేర్‌హామ్‌ స్పిన్‌కు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సమాధానం చెప్పలేకపోయారు. వేర్‌హామ్‌ 3 ఓవర్లలో కేవలం 13 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశారు. సోఫీ మోలనూ 2/17, అలానా కింగ్‌ 2/26తో మెరుస్తూ ప్రత్యర్థి బ్యాటింగ్‌ను చిత్తు చేశారు.

దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ మాత్రమే కొంత ప్రతిఘటన చూపించింది. ఆమె 44 పరుగులు చేసింది. నదైన్‌ డిక్లెర్క్‌ 25 పరుగులతో రెండో అత్యధిక స్కోరు సాధించింది. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో మొత్తం జట్టు 16.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది.

ఈ విజయం తో ఆస్ట్రేలియా మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ సమతూక ప్రదర్శనతో టోర్నీలో మిగతా జట్లకు హెచ్చరికలు పంపింది.

శనివారం జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ మహిళల జట్టు ఐర్లాండ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితాలతో గ్రూప్‌ పోటీలు మరింత ఆసక్తికరంగా మారాయి.