గస్ అట్కిన్సన్‌.. ఈసీబీ విచారణ ప్రారంభం

ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ , సహచర ఆటగాడు అట్కిన్సన్ నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకున్నారు. న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం జట్టు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి ఇద్దరూ నైట్‌క్లబ్‌కు వెళ్లిన ఘటనపై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విచారణ ప్రారంభించింది.

బ్రిటిష్ మీడియా కథనాల ప్రకారం, లండన్‌లోని చెల్సియా ప్రాంతంలో ఉన్న ఒక నైట్‌క్లబ్‌లో స్టోక్స్ , అట్కిన్సన్ లు ఉన్న సమయంలో ఒక రగ్బీ అకాడమీ ఆటగాడితో వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆ వాగ్వాదం మధ్యలో ఆ రగ్బీ ఆటగాడు అట్కిన్సన్ పై పంచ్ విసరగా, అది అక్కడ విధుల్లో ఉన్న ఈసీబీ భద్రతా సిబ్బందిలో ఒకరికి తగిలింది. ఈ దెబ్బతో ఆ భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడి, గాయానికి కుట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటనలో స్టోక్స్ , అట్కిన్సన్లు దాడికి పాల్పడ్డారని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. ఇద్దరు క్రికెటర్లు ఘర్షణకు దిగలేదని, నేరుగా హింసాత్మక చర్యల్లో పాల్గొనలేదని ఈసీబీ వర్గాలు కూడా సూచిస్తున్నాయి. అయితే జట్టు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించడం మాత్రం జట్టు క్రమశిక్షణకు విరుద్ధమని ఈసీబీ స్పష్టంగా భావిస్తోంది.

ఇటీవలి కాలంలో జట్టులో క్రమశిక్షణ సమస్యలు తలెత్తడంతో, ఆటగాళ్లపై నియంత్రణ కోసం ఈసీబీ అర్ధరాత్రి కర్ఫ్యూ అమలు చేసింది. ఆ నిబంధనను స్టోక్స్ , అట్కిన్సన్ లు ఉల్లంఘించిన నేపథ్యంలో, ఈ ఘటనను బోర్డు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టోక్స్ కెప్టెన్సీపై కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు ఇంగ్లండ్ మీడియాలో వినిపిస్తున్నాయి.

రెండో టెస్ట్‌కు ముందు క్రికెట్ రెగ్యులేటర్ నివేదికల ఆధారంగా ఈసీబీ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అక్కడి కథనాలు సూచిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలను ఈసీబీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని, రెండో టెస్ట్ జట్టు ఎంపికకు ముందు తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని బోర్డు వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.

ఇప్పటివరకు లభించిన సమాచారం ప్రకారం, భద్రతా సిబ్బందికి గాయమైన ఘటనలో స్టోక్స్ లేదా అట్కిన్సన్ నేరుగా దాడి చేసినట్లు నిర్ధారణ కాలేదు. అయితే జట్టు కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించిన అంశాన్ని ఈసీబీ తీవ్రంగా పరిగణిస్తున్నందున, ఇద్దరు ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.