రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
భారత్–అప్ఘనిస్థాన్ ఏకైక టెస్టు ప్రారంభం
భారత్–అప్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ప్రారంభమైంది. న్యూ చంఢీగఢ్ ముల్లాన్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గిల్ తెలిపాడు. ఈ మ్యాచ్‌తో యువ ఆల్‌రౌండర్ మానవ్ సుతార్‌కు టెస్టు అరంగేట్రం లభిస్తోంది. భవిష్యత్తు టెస్టు క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పిస్తున్న టీమిండియా, అప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన మానవ్ సుతార్‌ను నేరుగా ప్లేయింగ్ 11లో చోటు కల్పించడం విశేషంగా మారింది.
ఇటీవల సౌతాఫ్రికాతో సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైన భారత్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై ప్రదర్శించిన ఆటతీరు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ వెంటనే సౌతాఫ్రికాపై హోం సిరీస్‌లో పరాజయం చవిచూడడంతో జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సిరీస్‌లో గిల్ గాయం కారణంగా మధ్యలోనే తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రిషభ్ పంత్‌కి వెళ్లాయి. అయితే ఆ సిరీస్‌లో జట్టు విఫలమవ్వడంతో ఇప్పుడు వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా పంత్‌ను బీసీసీఐ తప్పించింది. ఆ బాధ్యతలను సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు అప్పగించింది.
భారత్–అప్ఘనిస్థాన్ మధ్య ఇప్పటివరకు ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే జరిగింది. 2018లో జరిగిన ఆ టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్ అనంతరం ట్రోఫీ సంబరాల్లో అప్ఘనిస్థాన్ ఆటగాళ్లను కూడా భాగస్వామ్యం చేయడం అప్పట్లో క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అప్ఘనిస్థాన్ క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ అందిస్తున్న సహకారంపై ఆ దేశ హెడ్ కోచ్ కృతజ్ఞతలు తెలిపాడు. అప్ఘనిస్థాన్‌తో వన్డే, టెస్టు, టీ20 సిరీస్‌లను ప్లాన్ చేయడంపై బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ టెస్టు కోసం టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉంది: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
అప్ఘనిస్థాన్ ప్లేయింగ్ 11: అబ్దుల్ మాలిక్, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), సెదీకుల్లా అటల్, అఫ్సర్ జజాయ్, అజ్మతుల్లా ఒమర్జాయి, షరాఫుద్దీన్ అష్రఫ్, మహ్మద్ సలీమ్ సఫీ, జియా రహ్మాన్ షరీఫీ, నంగేయాలియా ఖరోటే.







