రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
అద్భుత ఆరంభం వృథా..
అర్ధశతకానికి తక్కువగానే ఔటైన వైభవ్ సూర్యవంశీ
భారత్-A తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అద్భుత ఆరంభాన్ని పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఆఫ్గనిస్తాన్ -Aతో గురువారం జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ దూకుడు ఇన్నింగ్స్ ఆడినా, హాఫ్ సెంచరీకి చేరువలోనే వికెట్‌ను సమర్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్గనిస్తాన్ -A జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్-A తరఫున ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన ప్రభ్సిమ్రన్ సింగ్ , వైభవ్ సూర్యవంశీ ఆరంభం నుంచే దూకుడు శైలిలో ఆడారు. ఇద్దరూ కలిసి ఆఫ్గనిస్తాన్ -A బౌలర్లపై విరుచుకుపడుతూ వేగంగా పరుగులు రాబట్టారు.
ప్రత్యేకంగా వైభవ్ తన సహజ దూకుడు శైలిలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 22 బంతుల్లోనే 9 ఫోర్లతో 44 పరుగులు సాధించాడు. 200 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతడు అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించిన సమయంలోనే అతడి ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడింది.
7.1వ ఓవర్‌లో అబ్దుల్లాహ్ అహ్మాద్జాయ్ వేసిన షార్ట్ బాల్‌ను వికెట్ కీపర్ మీదుగా ర్యాంప్ షాట్ ఆడేందుకు వైభవ్ ప్రయత్నించాడు. అయితే బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. బ్యాట్‌కు స్వల్పంగా తాకిన బంతి నేరుగా వికెట్ కీపర్ మొహమ్మద్ ఇషాక్ చేతుల్లోకి చేరింది. దీంతో వైభవ్ 44 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్‌కి చేరాడు.
మంచి ఆరంభం లభించినప్పటికీ దాన్ని భారీ స్కోరుగా మలచుకోలేకపోవడం వైభవ్‌కు పునరావృతమవుతున్న సమస్యగా కనిపిస్తోంది. మరోసారి నిర్లక్ష్యంగా ఆడిన షాట్ కారణంగా విలువైన వికెట్ కోల్పోవడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. అయితే అతడు ఆడిన దూకుడు ఇన్నింగ్స్ భారత్-Aకి శుభారంభాన్ని అందించింది.
వైభవ్ ఔటయ్యే సమయానికి భారత్-A జట్టు స్కోరు 7.2 ఓవర్లలో 74 పరుగులు. మరోవైపు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 28 పరుగులతో క్రీజులో నిలకడగా కొనసాగుతున్నాడు. ట్రై సిరీస్‌లో కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్-Aకి వైభవ్ ఇచ్చిన వేగవంతమైన ఆరంభం మిడిలార్డర్‌పై ఒత్తిడిని తగ్గించిందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఇన్నింగ్స్‌తో మరోసారి తన ప్రతిభను చాటుకున్న వైభవ్, పెద్ద స్కోర్లను నమోదు చేసే దిశగా ఇన్నింగ్స్‌ను మరింత సుదీర్ఘంగా కొనసాగించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ట్రై సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో ఈ లోపాన్ని సరిదిద్దుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.







