రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
టీ20 చరిత్రలో సంచలనం: వాషింగ్టన్ ఫ్రీడమ్ 267 పరుగుల లక్ష్య ఛేదనతో వరల్డ్ రికార్డు
మేజర్ లీగ్ క్రికెట్ 2026లో వాషింగ్టన్ ఫ్రీడమ్ , MI న్యూ యార్క్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టీ20 క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. 267 పరుగుల భారీ లక్ష్యాన్ని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఛేదించడం ద్వారా టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్‌గా ఈ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన MI న్యూ యార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. భారీ స్కోరుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే వాషింగ్టన్ ఫ్రీడమ్ బ్యాటర్లు ఆ లక్ష్యాన్ని మరింత సులభంగా కనిపించేలా చేశారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 270 పరుగులు చేసి 267 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించారు.
ఈ విజయంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక లక్ష్య ఛేదన రికార్డు వాషింగ్టన్ ఫ్రీడమ్ పేరిట నమోదైంది. ఈ ఏడాది IPLలో పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ పై ఛేదించిన 265 పరుగుల లక్ష్యమే ఇంతకుముందు అత్యధిక విజయవంతమైన రన్‌చేజ్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డు రెండో స్థానానికి చేరింది.
ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. ఇరు జట్లు కలిపి మొత్తం 51 సిక్సర్లు బాదాయి. టీ20 చరిత్రలో ఒకే మ్యాచ్‌లో 50కు పైగా సిక్సర్లు నమోదవడం ఇదే మొదటిసారి. MI న్యూ యార్క్ బ్యాటర్లు 29 సిక్సర్లు కొట్టగా, వాషింగ్టన్ ఫ్రీడమ్తరఫున బ్యాటర్లు 22 సిక్సర్లు బాదారు. ఇంతకుముందు ఒక టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక సిక్సర్ల సంఖ్య 42 మాత్రమే.
వాషింగ్టన్ ఫ్రీడమ్ చేసిన 270/4 స్కోరు మేజర్ లీగ్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక జట్టు స్కోరుగా నిలిచింది. ఇదే లీగ్‌లో సం ఫ్రాన్సిస్కో యునికార్న్స్ చేసిన 269/5 స్కోరే ఇంతకుముందు అగ్రస్థానంలో ఉండేది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 536 పరుగులు చేయగా, ఇది టీ20 చరిత్రలో రెండో అత్యధిక మ్యాచ్ అగ్రిగేట్. 2024 IPLలో రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు – సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో నమోదైన 549 పరుగులే ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నాయి.
బ్యాటింగ్ పరంగా ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకే టీ20 మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. MI న్యూ యార్క్ తరఫున నికోలస్ పూరన్ 106 పరుగులు చేయగా, వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున ఆండ్రీస్ గౌస్ 132 పరుగులు, స్టీవ్ స్మిత్ అజేయంగా 110 పరుగులు చేశారు.
గౌస్ , స్టీవ్ స్మిత్ మూడో వికెట్‌కు 241 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇది టీ20 చరిత్రలో దేశీయ క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి అమెరికా బ్యాటర్‌గా ఆండ్రీస్ గౌస్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.
నికోలస్ పూరన్ తన సెంచరీని కేవలం 31 బంతుల్లో పూర్తి చేసి ఫ్రాంచైజీ టీ20 క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. 2013 IPLలో క్రిస్ గేల్ 30 బంతుల్లో చేసిన సెంచరీ మాత్రమే పూరన్ కంటే వేగంగా ఉంది. అలాగే పూరం కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి MLC చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వెస్ట్ ఇండీస్ ఆల్‌రౌండర్ పోల్లర్డ్ కూడా ఈ మ్యాచ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన కెరీర్‌లో 1001వ సిక్సర్ బాది టీ20 క్రికెట్‌లో వెయ్యికి పైగా సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.
వాషింగ్టన్ ఫ్రీడమ్, MI న్యూ యార్క్ మధ్య ఈ హై స్కోరింగ్ పోరు టీ20 క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యాన్ని మరోసారి స్పష్టంగా చూపించడమే కాకుండా, భవిష్యత్తులో టీ20 ఫార్మాట్‌లో లక్ష్య ఛేదనల పరిమితులు ఎంతవరకు విస్తరించవచ్చో సూచించింది.







