రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
కుటుంబ కలహాలు, అదనపు కట్నం వేధింపులు ఓ నిండు సంసారంలో ఘోర విషాదాన్ని నింపాయి. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఇంట్లో తల్లితో పాటు ఇద్దరు పసిపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన భారతి (24)కి నక్కా సునీల్ రెడ్డితో 2019లో వివాహమైంది. వీరికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) కుమారులు ఉన్నారు. అయితే పెళ్లైన నాటి నుంచి కట్నం కోసం భర్త, అత్తమామలు భారతిని తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి భారతితో పాటు ఇద్దరు చిన్నారులు ఇంట్లో విగతజీవులుగా పడిఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
ఘటనా స్థలాన్ని వినుకొండ సీఐ ప్రభాకర్ రావు పరిశీలించారు. మంచంపై ఉన్న ఇద్దరు పిల్లలను ఊపిరాడకుండా చేసి చంపినట్లు తెలుస్తోందని, భారతి ఉరివేసుకున్న స్థితిలో కనిపించిందని సీఐ తెలిపారు. బాధితురాలి మేనమామ నాగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం ఏడేళ్ల లోపు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణిస్తే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలోనే విచారణ జరగాల్సి ఉండటంతో వినుకొండ తహసీల్దార్ సురేష్ నాయక్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుల బంధువులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లను ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రికార్డ్ చేసుకుని, తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
తహసీల్దార్ ఆధ్వర్యంలో పంచనామా ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది ఆత్మహత్యా లేక ఎవరైనా చంపేశారా అనేది సాంకేతికంగా నిర్ధరణ అవుతుందని పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో విఠంరాజుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.







