సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయ విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభల్ ప్రతాప్ సింగ్‌, చందర్‌ భాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. జులై 10న కోర్టులో ప్రభల్ ప్రతాప్ ప్రధాన న్యాయమూర్తిపై దుర్భాషలాడటమే కాకుండా కాగితాలు విసిరి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భద్రతా సిబ్బందిని తోసి విధులకు ఆటంకం కలిగించాడు. అతడితో పాటు ఉన్న రెండో నిందితుడు చందర్‌ భాన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులిద్దరూ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు.

అయితే.. ఈ ఘటనపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ‘‘అతడు తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నాడు. నిరాశతో అలా ప్రవర్తించాడు. అతడిపై మాకు సానుభూతి మాత్రమే ఉంది’’ అని వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సూర్యకాంత్ దీనిపై మాట్లాడుతూ.. ‘‘ఈ ఘటనను పెద్దది చేయొద్దు. యువత కొన్ని సందర్భాల్లో ఇలా ప్రవర్తిస్తారు. రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత’’ అని పేర్కొన్నారు.