రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్‌కి టీటీడీ గ్రీన్‌సిగ్నల్
తిరుమల: తిరుమలలో పరిపాలనను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న కార్యాలయాలను ఒకే చోట సమీకరించేందుకు ‘సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్’ నిర్మాణానికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. దాదాపు రూ.85 కోట్ల వ్యయంతో ఈ భవంతిని నిర్మించనున్నారు.
ప్రస్తుతం తిరుమలలో అనేక విభాగాలు విస్తృతంగా సేవలందిస్తున్నప్పటికీ, వాటి కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల పరిపాలనలో సమన్వయం లోపిస్తోందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా, అనేక కార్యాలయాలు కాటేజీలలో పనిచేస్తుండటంతో భక్తులకు వసతి సదుపాయాలపై కూడా ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను ఒకే భవనంలో ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరమవడంతో పాటు భక్తులకు అదనపు వసతి సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుందని టీటీడీ నిర్ణయించింది.
ఈ సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్‌ను నాలుగు అంతస్థులుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తం 24 విభాగాలు ఈ భవనంలో నుంచే పరిపాలన సాగించేలా అవసరమైన సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమలలో అదనపు ఈవో కార్యాలయం, ఇంజనీరింగ్, రెవెన్యూ, ఎస్టేట్, విజిలెన్స్, అగ్నిమాపక, ఆరోగ్య, ఉద్యానవన, అటవీ, ఆలయ, అన్నప్రసాదం, కల్యాణకట్ట, మార్కెటింగ్, డెయిరీ ఫాం, డోనర్ సెల్, ట్రాన్స్‌పోర్టు, హెల్త్, ప్రజాసంబంధాలు, అకౌంట్స్, ఐటీ, పరకామణి, మ్యూజియం, అర్బన్ ప్లానింగ్ తదితర విభాగాలన్నీ ఈ భవనంలోనే ఉండేలా ప్రతిపాదించారు.
సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్ నిర్మాణానికి బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తర భాగంలో దాదాపు 1.35 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ పార్కింగ్ సదుపాయాలకు అనుకూలంగా విస్తీర్ణం ఉండటంతో పాటు రింగ్‌రోడ్డు, క్యూలైన్లు సమీపంలోనే ఉండటం ఈ స్థలానికి అదనపు అనుకూలతగా అధికారులు గుర్తించారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతం పరిపాలన భవనానికి అనువుగా ఉంటుందని టీటీడీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
టీటీడీ బోర్డు ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టెండర్లు పూర్తి అయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్ పూర్తయ్యాక తిరుమల పరిపాలన మరింత కేంద్రీకృతమై, నిర్ణయాలు వేగంగా అమలయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు భావిస్తున్నాయి.







