మున్సిపల్ ఎన్నికల వేళ బాధ్యతాయుతంగా వార్తలు రాయండి:డీఎస్పీ బాలస్వామి రెడ్డి

ప్రొద్దుటూరు: రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు మీడియా ప్రతినిధులు, YouTube ఛానళ్ల నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని ప్రొద్దుటూరు డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ ఫ్యాక్టే సంకేత్ విస్నాథ్ ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని మీడియా ప్రతినిధులు, YouTube ఛానళ్ల నిర్వాహకులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వార్తల ప్రసారం, సామాజిక మాధ్యమాల్లో సమాచార వ్యాప్తి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు సమాచారం అందించడంలో మీడియా కీలకపాత్ర పోషిస్తుందని, అదే సమయంలో వార్తల ప్రసారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

ఎన్నికల కాలంలో ఏ సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల ద్వారా వాస్తవాలను ధృవీకరించుకుని మాత్రమే వార్తలను ప్రచురించాలని డీఎస్పీ సూచించారు. నిర్ధారణ కాని సమాచారాన్ని వార్తల రూపంలో ప్రసారం చేయడం వల్ల అపోహలు, ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

రాజకీయ నాయకుల వ్యాఖ్యలు, ఇతర సున్నితమైన సమాచారాన్ని ప్రచురించే సమయంలో వాటి ప్రభావాన్ని ముందుగా పరిశీలించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చట్టపరమైన నిబంధనలకు లోబడి వార్తలను ప్రసారం చేయాలని డీఎస్పీ సూచించారు.

వ్యక్తులు లేదా ఇతర సమాచార మాధ్యమాల ద్వారా వ్యాపించే పుకార్లను పరిశీలించకుండా ప్రచురించకూడదని, ప్రజల్లో భయాందోళనలు, అపోహలు కలిగించే సమాచారాన్ని నిరోధించడం మీడియా బాధ్యతగా ఆయన గుర్తుచేశారు.

YouTube ఛానళ్ల నిర్వాహకులు వేగంగా వార్తలను అందించాలనే తొందరలో నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రసారం చేయకూడదని డీఎస్పీ సూచించారు. సమాచారాన్ని పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే ప్రచురించి, ప్రజలను తప్పుదారి పట్టించే పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని ఆయన పేర్కొన్నారు.

WhatsApp గ్రూపుల నిర్వాహకులు కూడా అప్రమత్తంగా ఉండాలని, గ్రూపుల్లో ప్రసారమయ్యే వార్తలు, సందేశాలపై నిఘా ఉంచి తప్పుడు వార్తలు, పుకార్లు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సూచించారు. చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తి జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు సరైన సమాచారం అందించడం, తప్పుడు ప్రచారాన్ని అరికట్టడం, ప్రశాంత వాతావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగేందుకు media ప్రతినిధులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ సహకరించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, మీడియా ప్రతినిధులు, YouTube ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.