రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: జాతీయ స్థాయిలో శ్రీ సత్యసాయి జిల్లా మరోసారి ప్రతిభ చాటింది. న్యూఢిల్లీ లోని NASC (నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్) ఆవరణలో ఈరోజు ఉదయం నిర్వహించిన ‘ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన’ (PMDDKY) జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ జిల్లా దేశవ్యాప్తంగా ఉత్తమ జిల్లాగా ఎంపికైంది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరిచిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కు ఆయన ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డును ఘనంగా ప్రదానం చేశారు.
రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందించడంలో, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో శ్రీ సత్యసాయి జిల్లా దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,69,970 మంది రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు పంపిణీ చేయబడినట్లు అధికారిక వివరాలు సూచిస్తున్నాయి. పంపిణీ చేసిన రుణాల మొత్తం రూ. 4,992 కోట్లకు చేరుకుంది.
రైతులకు ఆర్థిక చేయూతనిచ్చి, పెట్టుబడి ఇబ్బందులు లేకుండా చేయడం ద్వారా నాణ్యమైన పంటల సాగును ప్రోత్సహించడం, వారి ఆర్థిక అభివృద్ధికి బాటలు వేయడం వంటి లక్ష్యాలతో జిల్లాలో వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన యత్నాలు ఈ అవార్డు రూపంలో ఫలితమిచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లా యంత్రాంగం సమన్వయంతో బ్యాంకులు, వ్యవసాయ శాఖ, రైతు సంఘాలు కలిసి పనిచేయడం వల్ల రైతులకు అవసరమైన సమయంలో రుణాలు అందుబాటులోకి రావడంతో పాటు, ఆధునిక సాగు పద్ధతుల అమలు సులభమైందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ జాతీయ అవార్డు తనతో పాటు మొత్తం జిల్లా యంత్రాంగంపై మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. జిల్లాలోని రైతుల ఆర్థిక స్థితిగతులు మరింత బలపడేలా ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ జాతీయ అవార్డు మా జిల్లా యంత్రాంగంపై మరింత బాధ్యతను పెంచింది. మా జిల్లాలోని రైతులందరూ తాము పండిస్తున్న పంటలలో అత్యధిక దిగుబడులు సాధించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిగతులు మరింత బలపడేలా ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటాం. ఆరుగాలం శ్రమిస్తూ, వినూత్న పద్ధతుల్లో పంటలు పండిస్తూ అన్నపూర్ణగా నిలుస్తున్న మా జిల్లాలోని ప్రతి రైతుకూ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు, శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి చెందేందుకు, రైతు సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా అమలు కావడానికి తోడ్పడనుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.













