రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలోని 26వ వార్డులో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ రాచమల్లు రమాదేవి శుక్రవారం ఉదయం పర్యటించారు. వార్డు పరిధిలోని వివిధ వీధుల్లో తిరిగి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శాంతకుమారి వీధి, ఆకులోళ్ల వీధిలో నెలకొన్న పారిశుధ్య సమస్యలను స్థానికులు రాచమల్లు దంపతుల దృష్టికి తీసుకువచ్చారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, మురుగునీటి నిల్వల వల్ల దుర్వాసన, దోమల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వివరించారు.

గత రెండున్నరేళ్లుగా కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాలువల శుభ్రతపై అధికారులకు హడావుడి మొదలైందా? రెండున్నరేళ్లుగా పట్టించుకోని సమస్య ఇప్పుడు మాత్రమే ఎందుకు గుర్తుకొచ్చింది? అంటూ వార్డు పరిధిలో చర్చ నడుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పారిశుధ్య పనులు వేగం పుంజుకోవడం పై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారం కోసం రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, రాచమల్లు రమాదేవి క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీధి వీధి తిరిగి కాలువల పరిస్థితి, చెత్త నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు.
పర్యటనలో భాగంగా సమస్యల తీవ్రతను ప్రత్యక్షంగా గమనించిన రాచమల్లు దంపతులు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత మున్సిపల్ అధికారులకు తెలియజేసి పరిష్కారం కోసం చర్యలు తీసుకునేలా చూడాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వార్డు పరిధిలో పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడేలా అధికార యంత్రాంగం కదిలేనా అన్నది ఇప్పుడు అక్కడి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.













