రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: శ్రీ సత్య సాయి జిల్లా, పుట్టపర్తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పాక్షికంగా, ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా మాట్లాడారు. జిల్లాలో మొత్తం 11,35,917 మంది ఓటర్లు ఉన్నారని, గతసారి ఎస్.ఆర్ (స్పెషల్ రివిజన్) కు ఇచ్చిన డ్రాఫ్ట్ రోల్ ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వస్తుందని, ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లన్నీ తొలగించే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రకటనలు, ప్రాణమోత్సవాలు, ప్రచారాల కోసం స్థానిక ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, పోలీస్ డిపార్ట్మెంట్ ఫార్వార్డింగ్తోనే అనుమతులు జారీ చేస్తారని చెప్పారు.
ఎన్నికల ఖర్చులను పర్యవేక్షించేందుకు ఎక్స్పెండిచర్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సమావేశంలో వెల్లడించారు. అనుమతించబడిన పరిమితి కంటే ఎక్కువ ఖర్చు జరిగితే నమోదు చేసి చర్యలు తీసుకుంటారని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచార వేళలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని, లంచం ఇవ్వడం పూర్తిగా నిషిద్ధమని తెలిపారు. అనుమతి లేకుండా చేసే పనులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్రమే రావాలని, ప్రతిపాదించేటప్పుడు అభ్యర్థితో పాటు ఒక్కరు మాత్రమే ఉండాలని అధికారులు సూచించారు. లౌడ్స్పీకర్ల వినియోగంపై కూడా మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నాయని తెలిపారు. లౌడ్స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వినియోగించుకోవాలని, ప్రజా ప్రయోజనాల కోసం రాత్రి 9 గంటలకే మూసివేయమని సూచనలు ఇస్తామని చెప్పారు. పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో లౌడ్స్పీకర్లు పెట్టడానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.
సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద వీడియోగ్రఫీ ఏర్పాటు చేయనున్నట్లు, మీడియా మానిటరింగ్ కమిటీలను జిల్లా కలెక్టరేట్ మరియు మున్సిపాలిటీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశంలో తెలిపారు. మొత్తం 467 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ ప్రక్రియను ఆర్డీవోలు, ఎంపీడీవోలు పర్యవేక్షిస్తున్నారని, వార్డు సభ్యుల డీలిమిటేషన్ పనులను పంచాయతీ అధికారులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగనున్నాయని అధికారులు వివరించారు. మొదటి దశ నవంబర్ 13 నుంచి నవంబర్ 26 వరకు, రెండవ దశ నవంబర్ 16 నుంచి పోలింగ్ నవంబర్ 29 వరకు, మూడవ దశ డిసెంబర్ 2 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని, ప్రజలు మరియు మీడియా సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, జెడ్పీ సీఈఓ వెంకట సుబ్బయ్య, డిఎఫ్ఓ చక్రపాణి పాల్గొన్నారు.













