రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్:
రీవాల్యూయేషన్ మళ్ళీ అదే సంస్థకు
కోఎంప్ట్ ఎడ్యుటెక్‌కే – సీబీఎస్ఈ నిర్ణయం
న్యూఢిల్లీ : రీవాల్యూయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థుల జవాబు పత్రాల స్కానింగ్ బాధ్యతను కూడా అదే వివాదాస్పద సంస్థ అయిన ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’కే కొనసాగించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించింది. సీబీఎస్ఈ పోర్టల్‌పై భద్రతా లోపాల అంశంపై జరుగుతున్న ఆడిట్ సందర్భంగా ఈ విషయాన్ని ఓ ఐఐటీకి చెందిన అధికారి వెల్లడించారు.
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాలను ఆన్ స్ర్కీన్ మార్కింగ్ విధానంలో భాగంగా కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థ ద్వారానే స్కాన్ చేయించింది. అయితే స్కానింగ్ ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించి మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే రీవాల్యూయేషన్ కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను సీబీఎస్ఈ ప్రారంభించింది.
ఆన్ స్ర్కీన్ మార్కింగ్ (ఓఎస్ఎం)లో భాగంగా దాదాపు 40 కోట్ల పేజీలను స్కాన్ చేశారు. అందులో కేవలం 30 వేల పేజీలతో మాత్రమే సమస్య వచ్చింది. అంటే ప్రతి 10 వేల పేజీల్లో కేవలం ఒక్క పేజీనే సరిగ్గా స్కాన్ కాలేదన్నమాట. రీవాల్యూయేషన్‌లో ఆ పేజీలను మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నాం. అని ఓ అధికారి వివరించారు. కోఎంప్ట్ ఎడ్యుటెక్ సేవలను కొనసాగించడాన్ని ఆయన సమర్థించినట్లు తెలుస్తోంది.
రీవాల్యూయేషన్ కోసం సీబీఎస్ఈ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రత్యేక పోర్టల్‌లో ఈ నెల 4వ తేదీ వరకు 63,119 మంది విద్యార్థులు రీవాల్యూయేషన్ కోసం, 7,314 మంది మార్కుల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తులు సమర్పించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. రీవాల్యూయేషన్ ప్రక్రియలో భాగంగా సమస్యాత్మకంగా గుర్తించిన పేజీలను మాత్రమే మళ్లీ స్కాన్ చేయనున్నట్లు సూచనలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రీవాల్యూయేషన్ పోర్టల్‌పై సైబర్ దాడుల యత్నాలు జరిగిన నేపథ్యంలో సీబీఎస్ఈ భద్రతాపరమైన సమీక్ష చేపట్టింది. ఈ సమీక్ష అనంతరం విద్యార్థుల ఓఎస్ఎం డేటా మొత్తాన్ని కోఎంప్ట్ ఎడ్యుటెక్ సర్వర్ల నుంచి సీబీఎస్ఈ స్వంత సర్వర్లకు బదిలీ చేసింది. డేటా భద్రతను మరింత బలోపేతం చేయడానికి, సైబర్ దాడుల యత్నాలను అడ్డుకునేందుకు ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ నిపుణులు సీబీఎస్ఈకి సాంకేతిక సహకారం అందిస్తున్నారు.
కోఎంప్ట్ ఎడ్యుటెక్ చుట్టూ కొనసాగుతున్న వివాదం, సైబర్ భద్రతా ఆందోళనల మధ్య కూడా అదే సంస్థ సేవలను రీవాల్యూయేషన్ స్కానింగ్ కోసం కొనసాగించాలనే సీబీఎస్ఈ నిర్ణయం విద్యా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







