ఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలల్లో మూడో భాష బోధన, మూల్యాంకనంపై కొత్త విధివిధానాలు జారీ చేసింది. 9, 10 తరగతుల విద్యార్థులకు మూడో భాష (R3) ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేస్తూ బోర్డు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.

CBSE ప్రకటన ప్రకారం, 2026-27 విద్యా సంవత్సరంలో 9వ తరగతిలో చేరే విద్యార్థులందరూ తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాల్సి ఉంటుంది. ఇందులో మూడో భాషను R3గా పేర్కొంటూ, దానికి సంబంధించిన మూల్యాంకనాన్ని పాఠశాల స్థాయిలో నిర్వహించాల్సి ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.

పదవ తరగతి విద్యార్థులకు మూడో భాష (R3)పై బోర్డు పరీక్షలు ఉండవని CBSE తెలిపింది. అంటే, 10వ తరగతి చివర్లో నిర్వహించే ప్రధాన బోర్డు పరీక్షల్లో R3ను చేర్చరు. అయితే, 9, 10 తరగతులలో ఈ భాషకు సంబంధించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఈ అసెస్‌మెంట్ నిర్వహణ, మార్కుల కేటాయింపు, రికార్డు నిర్వహణ బాధ్యత ఆయా పాఠశాలలదే అని బోర్డు పేర్కొంది.

కొత్త నిబంధనలు 2027-28 విద్యా సంవత్సరంలో 10వ తరగతి బ్యాచ్ నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే, 2026-27లో 9వ తరగతిలో చేరే విద్యార్థులు, 2027-28లో 10వ తరగతికి చేరే సమయానికి ఈ మార్పులు పూర్తిగా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో CBSE అనుబంధ పాఠశాలలు తమ అకడమిక్ ప్లానింగ్, టైమ్‌టేబుల్, భాషల బోధన విధానాలను కొత్త మార్గదర్శకాల ప్రకారం సవరించాల్సి ఉంటుంది.

మూడో భాష బోధనను బలోపేతం చేయడం, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడం, బహుభాషా అభ్యాసాన్ని ప్రోత్సహించడం ఈ మార్పుల ప్రధాన లక్ష్యంగా CBSE పేర్కొంటోంది. పాఠశాలలు R3 ఎంపిక, బోధన, మూల్యాంకన విధానాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని బోర్డు సూచించింది.

CBSE జారీ చేసిన ఈ విధివిధానాల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న CBSE అనుబంధ పాఠశాలలు మూడో భాష బోధనను తమ పాఠ్య ప్రణాళికలో మరింత వ్యవస్థీకృతంగా అమలు చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల అమలుతో విద్యార్థుల భాషా అభ్యాసంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.