ఏపీలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (RGUKT) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు ప్రొవిజినల్‌ మెరిట్‌ జాబితా విడుదలైంది. ఈ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ మెరిట్‌ జాబితాను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. నూజివీడు, ఒంగోలు, ఆర్‌కే వ్యాలీ (ఇడుపులపాయ), శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత బీటెక్‌ కోర్సులో ప్రవేశాలకు గత నెలలో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.

ఆర్జీయూకేటీలో ప్రవేశాల కోసం ఈ ఏడాది మొత్తంగా 44,104 దరఖాస్తులు రాగా.. 4040 మంది ప్రాథమికంగా ఎంపికైనట్లు మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థుల్లో 96.7శాతం మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చినవారేనని తెలియజేసేందుకు తాను గర్వపడుతున్నానన్నారు. ఎంపికైన విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిక జాబితాను rgukt.in వెబ్‌సైట్‌లో పొందొచ్చని సూచించారు.

  • అలాగే, మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 9552300009 ద్వారా ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌లో ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ 2026 రిజల్ట్స్‌పై క్లిక్‌ చేసి మీ అప్లికేషన్‌ నంబర్‌ని ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

మరోవైపు, ట్రిపుల్‌ ఐటీల్లో జులై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. గత విద్యా సంవత్సరంలో జులై 15 నుంచి తరగతులు ప్రారంభమైనా ఈసారి 15 రోజుల ముందుగానే పీయూసీ-1 తరగతులు మొదలు పెడతారు. పాత విద్యార్థులకు జూన్‌ 29 నుంచే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది.