నీట్‌ రీటెస్ట్‌ నేపథ్యంలో టెలిగ్రామ్‌ యాప్‌పై తాత్కాలిక బ్రేక్

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన NEET UG ప్రశ్నాపత్ర లీకేజీ వ్యవహారం నేపథ్యంలో రీ ఎగ్జామ్‌ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ సందేశాల యాప్‌ టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. జూన్‌ 21న జరగనున్న నీట్‌ రీటెస్ట్‌ దృష్ట్యా, జూన్‌ 22 వరకు దేశంలో టెలిగ్రామ్‌ వినియోగాన్ని కేంద్రం పరిమితం చేసింది.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. అలాగే జూన్‌ 30 వరకు భారత్‌లో టెలిగ్రామ్‌ మెసేజ్‌ ఎడిటింగ్‌ సౌకర్యాన్ని నిలిపివేయాలని ఆ యాప్‌ నిర్వాహకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

టెలిగ్రామ్‌లో టైమ్‌స్టాంప్‌ అలాగే ఉండేలా పాత సందేశాలను సవరించే సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు NTA గుర్తించింది. ప్రశ్నాపత్ర లీకేజీకి సంబంధించిన ఆధారాలను, నిందితుల వివరాలను తారుమారు చేయడానికి, అలాగే తమ వద్ద ప్రశ్నాపత్రం ఉందని తప్పుడు ప్రచారం చేయడానికి ఈ ఫీచర్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో టెలిగ్రామ్‌లో ప్రశ్నాపత్రం యాక్సెస్‌ ఉందని మోసపూరితంగా ప్రచారం చేస్తున్న అనేక ఛానళ్లు, గ్రూపులు, బాట్‌లను ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. అయితే ఇవి మాత్రమే సరిపోవని భావించిన NTA, మరింత కఠిన చర్యల అవసరం ఉందని కేంద్రానికి సూచించడంతో ఆంక్షలు విధించినట్లు వెల్లడించింది.

ఈ నిర్ణయాల వల్ల చట్టబద్ధంగా టెలిగ్రామ్‌ వినియోగిస్తున్న సాధారణ యూజర్లకు అసౌకర్యం కలగొచ్చని అధికారులు అంగీకరించారు. అయినప్పటికీ దేశంలో అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షల్లో ఒకటైన NEET సమగ్రత, విశ్వసనీయతను కాపాడడం అత్యవసరమని, అందుకే ఈ తాత్కాలిక ఆంక్షలు తప్పనిసరి అయ్యాయని NTA స్పష్టం చేసింది.

గత నెల 3న నిర్వహించిన NEET UG పరీక్షలో ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో ఆ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ నెల 21న రీ ఎగ్జామ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఆరోగ్య, విద్యాశాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఈ శాఖల ఉన్నతాధికారులు ఇటీవల పార్లమెంటరీ సంఘానికి వివరించారు.

రీ ఎగ్జామ్‌ ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొన్న నిపుణులను రహస్య ప్రదేశంలో లాక్‌డౌన్‌లో ఉంచినట్లు వచ్చిన వార్తల మధ్య, రీటెస్ట్‌ పేపర్‌ కూడా లీక్‌ అయిందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. వాటిని NTA ఇప్పటికే ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవం, మోసపూరితమని స్పష్టం చేస్తూ, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.