దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి ముంబైతో పాటు పలు రాష్ట్రాల వరకు విద్యార్థులు పెద్దఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నిరసనలకు సామాజిక వర్గాలతో పాటు సినీ ప్రముఖుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ , ప్రీతీ జింటా వంటి నటులు ఈ అంశంపై స్పందించగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా విద్యార్థులకు మద్దతుగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

అలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా NEET వివాదంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని ఆమె పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా NEET పేపర్ లీక్, పరీక్షల నిర్వహణ, ఫలితాలపై వస్తున్న ఆరోపణలు, విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అలియా భట్ పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

“గడిచిన కొన్ని రోజులు నా మనసును ముక్కలు చేశాయి. అయితే అదే సమయంలో విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతున్న ధైర్యం నాకు ఆశను కలిగిస్తోంది. ప్రతి విద్యార్థి వెనుక ఒక కల ఉంటుంది. ఒక కుటుంబం ఆశలు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. వారు కేవలం తమ కోసమే కాదు, వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం కూడా పోరాడుతున్నారు” అని అలియా భట్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

యువతే దేశ భవిష్యత్తును నిర్మించబోతున్నారని Alia Bhatt అభిప్రాయపడ్డారు. అందుకే విద్యార్థుల గొంతును వినాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. NEET పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. హుమా ఖురేషి , షకీబ్ సలీం , ప్రకాష్ రాజ్ , షబానా అజమీ , స్వర భాస్కర్ తదితరులు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు.

ఇదిలా ఉండగా, నిరసనల్లో పాల్గొన్న నటి అయేషా ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాను ప్రశాంతంగా నిలబడి ఉన్నప్పటికీ, పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని అయేషా ఖాన్ ఆరోపించారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల నిరసనలను అణిచివేయకుండా, వారి సమస్యలను పరిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

NEET పేపర్ లీక్ వివాదం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యార్థులకు న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్‌లు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అలియా భట్ వంటి ప్రముఖుల స్పందన విద్యార్థుల ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తోందని వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి.