రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
అల్లు అర్జున్ ప్రోత్సాహంతోనే... ‘గుర్తుకొస్తున్నాయి’ వెబ్‌సిరీస్
‘‘ఈ రోజుల్లో సినిమాల స్థాయి కంటే కూడా కథలే కీలకం. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘సింగ్ గీతం’, ‘బ్లాస్ట్’, ‘మా ఇంటి బంగారం’ చిత్రాలు అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయి. అదే వరసలోనే ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ నిలుస్తుందని నా నమ్మకం’’ అని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
కథానాయకుడు సత్యదేవ్, దర్శకుడు కరుణాకరన్, నిర్మాతలు వై.రవిశంకర్, బన్నీ వాస్, ఎస్.కె.ఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ‘గుర్తుకొస్తున్నాయి’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక హైదరాబాదులో జరిగింది. విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా, వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌ను శరత్ చంద్ర నాయుడు నిర్మించారు. జులై 3 నుంచి ఈటీవీ విన్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
వేడుకను ఉద్దేశించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ, ఈ సిరీస్ విడుదలకు ఈటీవీ విన్ వేదికను ఎంచుకోవడం ఒక విజయమేనని అభిప్రాయపడ్డారు. ఈటీవీ విన్, గీతా ఆర్ట్స్ వంటి సంస్థలు అత్యుత్తమ కథలను ప్రేక్షకులకు అందిస్తున్నాయని, అలాంటి వేదిక నుంచి వస్తున్న ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకున్నారు.
కథానాయకుడు సత్యదేవ్ వెబ్‌సిరీస్‌లు, సినిమాల మధ్య ఉన్న గీత ఇప్పుడు చెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. మంచి కథ ఎక్కడ ఉన్నా ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు. ఈటీవీ విన్ వేదిక నుంచి ఇప్పటికే అనేక అద్భుతమైన కథలు వస్తున్నాయని, వాటి సరసన ‘గుర్తుకొస్తున్నాయి’ కూడా నిలవాలని ఆకాంక్షించారు.
కథానాయకుడు విరాజ్ అశ్విన్ ఈ సిరీస్ జీవితాల్లోని అనేక భావోద్వేగ క్షణాలతో రూపొందిందని తెలిపారు. భావోద్వేగాలతో పాటు హాస్యం కూడా బలమైన ప్రభావం చూపించేలా కథను మలిచినట్లు చెప్పారు.
నిర్మాత శరత్ చంద్ర నాయుడు తన సినీ ప్రయాణంలో అల్లు అర్జున్ పాత్రను గుర్తుచేసుకున్నారు. మొదట అల్లు అర్జున్ దగ్గర ఉంటూ ఆయన సోషల్ మీడియాను నిర్వహించిన తాను, తరువాత పలు బాధ్యతలు చేపట్టి, చివరకు ఈటీవీ విన్‌లో సిరీస్ నిర్మించే స్థాయికి వచ్చానని చెప్పారు. ఈ ప్రయాణం మొత్తం అల్లు అర్జున్ ప్రోత్సాహం, సహకారంతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు.
ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ ఈ సిరీస్‌లో తొలి ఎపిసోడ్‌ను ఉచితంగా చూడొచ్చని తెలిపారు. పేరులాగే ఈ సిరీస్ ఎప్పటికీ ప్రేక్షకుల గుర్తుల్లో నిలిచిపోతుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, సిరీస్ నటీనటులు, సాంకేతిక బృందం పాల్గొన్నారు.







