రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘బాహుబలి-3’ వస్తుంది.. అధికారిక ప్రకటనతో అభిమానుల్లో హర్షం
ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఎపిక్ యాక్షన్ చిత్రం ‘బాహుబలి’. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి మూడో భాగం రానుందని అధికారికంగా వెల్లడించడంతో సినీప్రియుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
తాజాగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్ట్రీమింగ్‌కు ముందుగా నెట్‌ఫ్లిక్స్ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అందులో ‘బాహుబలి 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రపంచం ఈ ప్రకటనను ఊహించలేదు.. మీ అందరికోసం బాహుబలి మూడో భాగం రానుంది
అని ఆ వీడియోలో ప్రభాస్, రానా, అనుష్క వెల్లడించారు.
అదే వీడియోలో అనుష్క గురించి ప్రభాస్ ఓ సరదా విషయాన్ని పంచుకున్నారు. స్వీటీ నవ్వడం మొదలుపెడితే కనీసం 40 నిమిషాల పాటు ఆపకుండా నవ్వుతుందని చెప్పారు. ఆమె ప్రతిరోజూ సెట్స్‌కు వస్తూ ఈరోజు నవ్వకూడదని అనుకుంటూ వచ్చేదని, నవ్వితే షూటింగ్ మొత్తం ఆగిపోతుందని, ఇంత పెద్ద సెట్ వేసిన నిర్మాతకు నష్టం కలుగుతుందని భావించేదని ఆయన సరదాగా వివరించారు. ఈ చిత్రం తనకు ఓ భావోద్వేగ ప్రయాణమని ప్రభాస్ ఆ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు.
సత్యరాజ్ కూడా సెట్స్ గురించిన ఓ జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సెట్‌లో కాస్ట్యూమ్స్ ఎంతో ఎక్కువగా ఉండేవని, కనుచూపు మేరా అంతా డ్రెస్‌లే కనిపించేవని, ఆ దృశ్యం చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.
‘బాహుబలి 3’ ఉంటుందని స్పష్టత రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు భాగాలతో చరిత్ర సృష్టించిన ఈ ఫ్రాంచైజీ మూడో భాగంతో మరింత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ‘ఆర్‌ఆర్ఆర్’ ప్రచార కార్యక్రమాల్లో రాజమౌళి మాట్లాడుతూ, ‘బాహుబలి 3’ తీసే అవకాశం ఉందని, ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మూడో భాగం తీస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు నటీనటుల నుంచే మళ్లీ స్పష్టత రావడంతో, ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ‘బాహుబలి 3’ పనులను ప్రారంభించే అవకాశాలపై ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. రెండు భాగాలతో రికార్డులు తిరగరాసిన రాజమౌళి, మూడో భాగంతో ఆ విజయాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.







