తమిళ స్టార్ హీరో విజయ్ ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆయన రాజకీయ ప్రవేశం, విజయంతో అభిమానుల్లో ఆనందం నెలకొన్నప్పటికీ, ఇకపై విజయ్‌ను సినిమాల్లో చూడలేమో అన్న బాధ కూడా వ్యక్తమవుతోంది. అయితే విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ ఉందని అభిమానులు కొంతమేర సాంత్వన పొందారు.

కానీ ఆ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ల్యాబ్ దశలోనే నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం, విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ సెన్సార్ సమస్యల కారణంగా ఆగిపోయింది. చిత్రంలో ఉన్న రాజకీయ అంశాలను దృష్టిలో పెట్టుకుని సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించినట్టు సమాచారం.

విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాత్రం ‘జన నాయగన్’ విడుదల సులభమవుతుందనే అభిప్రాయం సినీ వర్గాల్లో, అభిమానుల్లో నెలకొంది. అయితే సీఎం అయ్యి నెలరోజులు దాటినా కూడా ఈ సినిమా విడుదలపై స్పష్టత రాలేదు. దీంతో చిత్ర భవితవ్యంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది.

ఈ పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు నిర్మాత స్వయంగా రంగంలోకి దిగారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ అధినేత తాజా సమాచారం ప్రకారం నేరుగా ఢిల్లీలోని సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు. సెన్సార్ క్లియరెన్స్ కోసం అక్కడ కీలక సమావేశం జరగనున్నట్టు తెలిసింది. ఈ చర్చలతో ‘జన నాయగన్’ విడుదల విషయమై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే నెల రోజుల క్రితమే సెన్సార్ రివైజింగ్ కమిటీ ఈ సినిమాను వీక్షించింది. అయితే ఆ కమిటీలోని ఒక సభ్యుడు చిత్రంలోని కొన్ని అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, హీరో విజయ్ కూడా ముఖ్యమంత్రి బాధ్యతలతో బిజీగా ఉండటంతో సినిమా విడుదలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఆలస్యం మరింత పెరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఢిల్లీ చర్చలు సానుకూలంగా ముగిస్తే ‘జన నాయగన్’ విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది. అయితే అక్కడ కూడా సమస్యలు తలెత్తి, నిర్ణయం వాయిదా పడితే సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించిన అమౌంట్లు రీఫండ్ చేసే పరిస్థితి రావచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర భవిష్యత్తుపై పరిశ్రమ, అభిమానుల దృష్టి నిలిచింది.