టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ పరిశ్రమలో తనదైన విలనిజంతో, గంభీరమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూశారనే వార్త సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అకస్మాత్తుగా దివంగతులయ్యారన్న సమాచారం బయటకు రావడంతో సినీ పరిశ్రమ, అభిమానుల్లో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

హిందీ టెలివిజన్ రంగంలో B.R. చోప్రా రూపొందించిన ‘ మహాభారత ’ సీరియల్‌లో అశ్వత్తమ పాత్రతో ప్రదీప్ రావత్ తన నట జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం ‘ లగాన్ ’, ‘ సర్ఫారోష్ ’ వంటి హిందీ చిత్రాల్లో నటించి విశేషమైన గుర్తింపు పొందారు. తన గంభీరమైన హావభావాలు, శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు.

హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రసీమల్లోనూ ప్రదీప్ రావత్ విలన్‌గా, సహాయ నటుడిగా అనేక గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఒక వైపు భయం గొలిపే ప్రతినాయకుడిగా మెప్పిస్తూనే, మరోవైపు నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

నేపాలీ చిత్రసీమలో కూడా ఆయన తన ముద్ర వేశారు. ‘A Baato Ama’, ‘Hraswa Dirgha’ వంటి సినిమాల ద్వారా ఇతర దేశాల ప్రేక్షకుల ఆదరణను పొందారు. భిన్న భాషల్లో, భిన్న పాత్రల్లో నటిస్తూ తన కెరీర్‌ను విస్తరించుకున్నారు.

టాలీవుడ్‌లో దర్శకుడు S.S. రాజమౌళి రూపొందించిన ‘Sye’ చిత్రంలో ప్రదీప్ రావత్ పోషించిన ‘ భిక్షు యాదవ్ ’ పాత్ర ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్ర టాలీవుడ్ సినీ చరిత్రలో అత్యంత గుర్తింపు పొందిన విలన్ పాత్రలలో ఒకటిగా నిలిచింది. ఆ పాత్రలో ఆయన చూపించిన గంభీరత్వం, నటనకు గాను ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు.

తరువాత ‘ ఛత్రపతి ’, ‘ భద్ర ’, ‘ ఘజిని ’, ‘ స్టాలిన్ ’, ‘ దేశముదురు ’, ‘ సరైనోడు ’, ‘ వాల్తేర్ వీరయ్య ’ వంటి చిత్రాల్లో తన విశిష్ట నటనా ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి చిత్రంలోనూ తన పాత్రకు న్యాయం చేస్తూ, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం ప్రదీప్ రావత్ మృతి వార్తపై అధికారిక ప్రకటన కోసం సినీ వర్గాలు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ధృవీకరణ వచ్చే వరకు ఈ వార్తపై స్పష్టత కోసం వేచి చూడాల్సి ఉంది.