రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’
టీజర్‌పై ఆసక్తి.. జూన్ 8న విడుదల
దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం స్లండాగ్ – 33 టెంపుల్ రోడ్ ’పై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా, పూరి జగన్నాథ్, ఛార్మీ, జె.బి. నారాయణరావు కొండ్రోల్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. టీజర్ విడుదలకు ముందుగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. పూరి కనెక్టస్ సంస్థ జూన్ 6, 2026న సోషల్ మీడియాలో ఈ సినిమా టీజర్ లాంచ్ వివరాలను ప్రకటించింది.
జూన్ 8న సాయంత్రం 6 గంటలకు ‘స్లండాగ్ – 33 టెంపుల్ రోడ్ ’ టీజర్‌ను విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. చెన్నైలోని హోటల్ గ్రీన్ పార్క్ లో సాయంత్రం 5 గంటల నుంచి టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, సినీ ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.
ఈ టీజర్‌ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో టీజర్‌ను ఒకేసారి విడుదల చేయనున్నారు. మూడు భాషల్లోనూ టీజర్‌కు విజయ్ సేతుపతి స్వయంగా డబ్బింగ్ చెప్పడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ విషయాన్ని కూడా పూరి కనెక్టస్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో టీజర్‌పై అంచనాలు మరింతగా పెరిగాయి.
‘స్లండాగ్ – 33 టెంపుల్ రోడ్ ’లో విజయ్ సేతుపతికి జంటగా సంయుక్త నటిస్తోంది. టబు, కన్నడ నటుడు దునియా విజయ్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
పూరి జగన్నాథ్ శైలిలో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, ఎమోషన్ల మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి వచ్చే టీజర్ ద్వారా కథ, పాత్రలపై మరిన్ని సంకేతాలు లభించనున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







