టీజర్‌ విడుదల

నిజ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘స్లమ్‌ డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ టీజర్‌ను సోమవారం చెన్నైలో విడుదల చేశారు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఛార్మి, జె.బి.నారాయణరావుతో కలిసి నిర్మిస్తున్నారు. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా, సంయుక్తా మేనన్‌ కథానాయికగా నటిస్తుండగా, టబు కీలక పాత్రలో కనిపించనున్నారు. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై టీజర్‌ విడుదలతో ఆసక్తి పెరిగింది.

టీజర్‌ ప్రారంభంలోనే స్లమ్‌ ప్రాంతాల కఠిన వాస్తవాలను చూపించే దృశ్యాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా విజయ్‌ సేతుపతి చెప్పే సంభాషణలు చిత్రానికి బలమైన భావోద్వేగ నేపథ్యం ఉంటుందని సూచిస్తున్నాయి.

వేడుకలో పాల్గొన్న పూరి జగన్నాథ్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ‘స్లమ్‌ డాగ్‌’ను రేపటి తరం కోసం రూపొందించిన సినిమాగా అభివర్ణించారు. జెన్‌ జీ తరం క్రమశిక్షణ, భావోద్వేగాల పరంగా నిన్నటి తరంతో పోలిస్తే ముందుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరానికి చెందినవారు కుటుంబ సభ్యులందరితో కలిసి చూడాల్సిన సినిమా ఇదని పేర్కొన్నారు.

బయట వీధుల్లో కనిపించే భిక్షగాళ్ల అసలు జీవితాలపై ఈ సినిమా దృష్టి సారించిందని పూరి తెలిపారు. వారి వెనక దాగి ఉన్న కథలు, భావోద్వేగాలు సాధారణంగా ఎవరికీ తెలియవని, ఆ ప్రపంచాన్ని తెరపైకి తీసుకురావాలనే ఆలోచనతో ఈ కథను తెరకెక్కిస్తున్నట్టు వివరించారు. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి నటించడం తనకు ఎంతో ముఖ్యమని, ఆయన ప్రతి రోజూ సెట్‌కి ఓ కొత్త నటుడిలా వచ్చి, పాత్రలో ఒదిగిపోయే విధానం తనను ఆకట్టుకుందని పూరి పేర్కొన్నారు.

విజయ్‌ సేతుపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సినిమా విడుదలయ్యే ప్రతి భాషలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు. యాక్షన్‌, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని అభిప్రాయపడ్డారు. పూరి జగన్నాథ్‌ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటిగా నిలుస్తుందని అన్నారు.

ఈ టీజర్‌ విడుదల కార్యక్రమంలో వీటీవీ గణేశ్‌, జె.బి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ‘స్లమ్‌ డాగ్‌... 33 టెంపుల్‌ రోడ్‌’ పూర్తి షూటింగ్‌ దశ, విడుదల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చిత్ర బృందం సూచించింది.