అధిక కొలెస్ట్రాల్‌, గుండెజబ్బులు వృద్ధాప్యంతోనే ముడిపడి ఉంటాయనే కాలం పోయింది. ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసులోనే ఎంతోమంది గుండె సంబంధిత సమస్యలకు గురవుతున్నారు. తీరికలేని ఉద్యోగ జీవితం, గంటల కొద్దీ కదలకుండా కూర్చోవటం, అరకొర నిద్ర, మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గటం, నూనె–కొవ్వు–చక్కెర–ఉప్పు ఎక్కువగా కలిగిన ఆహారాలు అధికంగా తీసుకోవటం వంటి అంశాలు గుండెజబ్బుల ముప్పును పెంచుతున్నాయి. ముఖ్యంగా చెడ్డ కొలెస్ట్రాల్‌ ఎల్‌డీఎల్‌ మోతాదులు పెరగటం గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతోంది.

అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ (ఏసీసీ), అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ (ఏహెచ్‌ఏ) విడుదల చేసిన 2026 మార్గదర్శకాలు ఎల్‌డీఎల్‌ను వీలైనంత త్వరగా తగ్గించుకోవటం, ఆ నియంత్రణను జీవితాంతం కొనసాగించటం అవసరమని స్పష్టం చేస్తున్నాయి. కొలెస్ట్రాల్‌ అంతా చెడ్డది కాదని, మంచి రకం హెచ్‌డీఎల్‌ రక్తంలో ప్రసరించే అధిక కొలెస్ట్రాల్‌ను సంగ్రహించి కాలేయానికి చేరవేసి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమస్య మాత్రం ఎల్‌డీఎల్‌తోనే. ఇది రక్తనాళాల్లో పోగుపడి పూడికలుగా మారి, నాళాల లోపలి భాగాన్ని కుంచించేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ తగ్గి, పూడికలు విడిపోతే రక్తం గడ్డకట్టి గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.

అధిక కొలెస్ట్రాల్‌ గుండెపోటు ప్రధాన ముప్పు కారకాలలో ఒకటి. ప్రమాదకరమైన విషయం ఏమిటంటే– కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నా లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. చాలామందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చిన తర్వాత లేదా ఇతర పరీక్షల సందర్భంగా మాత్రమే అధిక కొలెస్ట్రాల్‌ బయటపడుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పోగుపడటం వృద్ధాప్యంలో కాకుండా యుక్తవయసు నుంచే, ఆ మాటకొస్తే బాల్యం నుంచే ప్రారంభమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఆరోగ్యం బాగానే ఉందనుకుని నిర్లక్ష్యం చేయకుండా, అప్పుడప్పుడూ కొలెస్ట్రాల్‌ పరీక్షలు చేయించుకోవటం, ముఖ్యంగా ఎల్‌డీఎల్‌ స్థాయిలను తెలుసుకోవటం అవసరం.

కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉన్నవారిలో 9–11 ఏళ్ల వయసు నుంచే ముందస్తు కొలెస్ట్రాల్‌ పరీక్షలు ప్రారంభించటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అధిక కొలెస్ట్రాల్‌ను తొలిదశలో గుర్తించటంతో పాటు, ఎల్‌డీఎల్‌ మోతాదులు మితిమీరినప్పుడు 30 ఏళ్ల నుంచే చికిత్స ఆరంభించటం అవసరమని తాజా మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. గుండెజబ్బులు లేనివారిలో ఎల్‌డీఎల్‌ 90 ఎంజీ/డీఎల్‌, ముప్పు కారకాలు ఎక్కువగా ఉన్నవారిలో 70 ఎంజీ/డీఎల్‌, ఇప్పటికే గుండెజబ్బులు ఉన్నవారిలో 55 ఎంజీ/డీఎల్‌ లోపే ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

ఒక్క కొలెస్ట్రాల్‌ పరీక్షతోనే గుండెపోటు ముప్పును పూర్తిగా అంచనా వేయటం సాధ్యంకాదు. లైపోప్రొటీన్‌ (ఏ), అపోలైపోప్రొటీన్‌ బి (అపాబ్‌) వంటి అదనపు పరీక్షలు అవసరమవుతాయి. లైపోప్రొటీన్‌ (ఏ) ఇతర కారకాలతో సంబంధం లేకుండానే గుండెపోటు ముప్పును పెంచగలదని, అపాబ్‌ పరీక్ష ఎల్‌డీఎల్‌ నిర్ణీత మోతాదులకు చేరుకున్న తర్వాత కూడా పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించటానికి తోడ్పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా కొలెస్ట్రాల్‌ తగ్గించుకోవటం సాధ్యమే అయినా, ఇవి అందరికీ సమానంగా పనిచేయవు. శరీరంలోని కొలెస్ట్రాల్‌లో సుమారు 25 శాతం మాత్రమే ఆహారంపై ఆధారపడుతుంది. మిగతాదంతా శరీరమే తయారుచేసుకుంటుంది. అందువల్ల కొందరికి స్టాటిన్స్‌ వంటి కొలెస్ట్రాల్‌ తగ్గించే మందులు తప్పనిసరిగా అవసరమవుతాయి. డాక్టర్లు సూచించినప్పుడు వీటిని క్రమం తప్పకుండా వాడితేనే కొలెస్ట్రాల్‌ అదుపులోకి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

చిన్న వయసులో స్టాటిన్స్‌ వాడితే కాలేయం పనితీరు తగ్గటం, కండరాల నొప్పులు వంటి దుష్ప్రభావాలు ఉంటాయనే ఆందోళనతో వైద్యులు ఇంతవరకూ కొంత వెనకడుగు వేస్తూ వచ్చారు. అయితే 25, 30 ఏళ్ల నుంచే గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలను అనుసరించి, జీవనశైలి మార్పులతో ఫలితం కనిపించని యువకులకు స్టాటిన్స్‌ ప్రారంభించటం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. వంశపారంపర్యంగా కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే స్వభావం గలవారికి ఇవి మరింత కీలకం.