21న అమరావతిలో రాష్ట్ర స్థాయి ‘యోగాంధ్ర-2026’

25వేల మందితో యోగా మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు

అమరావతి : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న అమరావతిలో భారీ స్థాయి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది. ‘యోగాంధ్ర-2026’ పేరుతో జరగనున్న ఈ రాష్ట్ర స్థాయి యోగా మహోత్సవానికి సుమారు 25 వేల మంది ప్రజలను భాగస్వాములుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి సమీపంలోని వెంకటపాలెం టోల్‌ ప్లాజా వద్ద వెస్ట్‌ బైపాస్‌ ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే వేదిక ఎంపిక, మౌలిక సదుపాయాల ఏర్పాటు, విభాగాల సమన్వయం వంటి పనులు ప్రారంభమయ్యాయి. వివిధ జిల్లాల నుంచి యోగా సాధకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పాల్గొనేలా సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

ఈ క్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ జి. వీర పాండియన్‌, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ సాయి కాంత్‌ వర్మ, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తదితర అధికారులు వెంకటపాలెంలోని ప్రతిపాదిత యోగా వేదికను ప్రత్యక్షంగా పరిశీలించారు. వేదిక చుట్టుపక్కల ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి భౌగోళిక పరిస్థితులు, రాకపోకల సౌలభ్యం, పార్కింగ్‌ అవకాశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

యోగా దినోత్సవానికి హాజరయ్యే ప్రజలు, విద్యార్థులు, యోగా సాధకులు, వివిధ శాఖల ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు చర్చించారు. వేదిక నిర్మాణం, పాల్గొనేవారి కూర్చోవడానికి అవసరమైన ఏర్పాట్లు, వేదికకు వెళ్లే మార్గాల అభివృద్ధి వంటి అంశాలపై సంబంధిత విభాగాలకు సూచనలు జారీ చేశారు.

కార్యక్రమం రోజున భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్‌ సదుపాయాలు, ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, వైద్య సేవలు, అత్యవసర సహాయక చర్యలు, ప్రజల రాకపోకల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులు ఆదేశించారు. ప్రతి విభాగం తమ బాధ్యతలను ముందస్తుగా ఖరారు చేసుకుని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరు..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా అధికారులు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రాకపోకల మార్గాలు, వేదిక వద్ద భద్రతా బలగాల మోహరింపు, నియంత్రణ గదుల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించి, అవసరమైన మార్పులు సూచించారు.