ఓటీటీ వేదికలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు ఆకర్షించాలంటే, సినిమాతో పాటు అదనపు అనుభూతిని అందించాల్సిన అవసరం పెరిగింది. థియేటర్‌లో అడుగుపెట్టిన ప్రేక్షకుడు సాధారణ ప్రదర్శనకన్నా, ఓ మాయా ప్రపంచంలోకి ప్రవేశించిన భావన కలిగితేనే కుటుంబ సమేతంగా థియేటర్‌కి రావాలనుకుంటున్నారు.

ఒక సినిమాను ఐమ్యాక్స్‌ స్క్రీన్‌పై చూస్తే మజా వేరు అని ప్రేక్షకులు భావించడం కూడా ఇదే కారణం. హాలీవుడ్‌ చిత్రసీమ ఈ ధోరణిని బలంగా అందిపుచ్చుకుంది. అబ్బురపరిచే సాంకేతికత, కళ్లుచెదిరే హంగులతో సినిమాలను రూపొందించడమే కాకుండా, వాటిని ప్రదర్శించే థియేటర్‌ ఫార్మాట్ల విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఐమ్యాక్స్‌, ఐమ్యాక్స్‌ విత్‌ లేజర్‌, స్క్రీన్‌ఎక్స్‌, 4DX వంటి ఫార్మాట్లతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

సాధారణ థియేటర్లతో పోలిస్తే ఐమ్యాక్స్‌ (IMAX) ఫార్మాట్‌లో తెర పరిమాణం చాలా పెద్దగా ఉంటుంది. మెరుగైన ప్రొజెక్షన్‌ వ్యవస్థతో అత్యంత స్పష్టమైన దృశ్యాలు, శక్తిమంతమైన సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా ప్రేక్షకులను కథా ప్రపంచంలో లీనమయ్యేలా చేస్తుంది. అసలు సిసలైన సినిమాటిక్‌ అనుభూతి కోసం ఐమ్యాక్స్‌ ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది.

ఐమ్యాక్స్‌ విత్‌ లేజర్‌ (IMAX with Laser) ప్రీమియం ఫార్మాట్‌గా నిలుస్తోంది. లేజర్‌ ప్రొజెక్టర్ల వినియోగంతో మరింత ప్రకాశవంతమైన దృశ్యాలు, సహజమైన రంగులతో చిత్రాలను ప్రదర్శించడం దీని ముఖ్య లక్షణం. ఐమ్యాక్స్‌ 3D (IMAX 3D) ఫార్మాట్‌ ద్వారా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విజువల్స్‌ను ప్రత్యేకంగా చూపించేందుకు సాంకేతికతను అనుగుణంగా మార్చారు.

డాల్బీ సినిమా (Dolby Cinema) థియేటర్లు డాల్బీ విజన్‌ లేజర్‌ ప్రొజెక్షన్‌, డాల్బీ అట్మాస్‌ మల్టీడైమెన్షనల్‌ సౌండ్‌ సిస్టమ్‌ మేళవింపుతో ఉంటాయి. సాధారణ థియేటర్లతో పోలిస్తే రెండింతల ప్రకాశవంతమైన దృశ్యాలు, 500 రెట్లు ఎక్కువ కాంట్రాస్ట్‌ కలిగిన రంగులతో స్పష్టమైన చిత్రాలు, థియేటర్‌ నలుదిక్కుల నుంచి వినిపించే శబ్దాలతో ప్రేక్షకులకు అత్యుత్తమ అనుభవం అందిస్తాయి.

స్క్రీన్‌ఎక్స్‌ (ScreenX) ఫార్మాట్‌లో సినిమా ఎదురుగా ఉన్న తెరపైనే కాకుండా కుడి, ఎడమ వైపు గోడలపైనా దృశ్యాలు కనిపిస్తాయి. 270 డిగ్రీల పానారోమిక్‌ అనుభూతిని ఇది అందిస్తుంది. దీనికోసం సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రత్యేక కెమెరాలను వినియోగించాల్సి ఉంటుంది. జులైలో విడుదల కాబోతున్న ‘Spider-Man: Brand New Day’ చిత్రాన్ని స్క్రీన్‌ఎక్స్‌ ఫార్మాట్‌ తెరలపై ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.

4DX థియేటర్లలో సినిమాలోని సన్నివేశాలకు అనుగుణంగా ఎఫెక్టులు ఉంటాయి. తెరపై హోరుగాలి వీచినప్పుడు థియేటర్‌లోనూ గాలి వీయడం, వర్షం సన్నివేశాల సమయంలో చిరుజల్లులు పడటం, పూలవన సన్నివేశాల్లో సువాసనను ప్రేక్షకులు ఆస్వాదించేలా ఏర్పాట్లు చేయడం వంటి అనుభూతులు అందిస్తాయి. ఛేజింగ్‌, యాక్షన్‌ సీన్ల సమయంలో సీట్లు ముందుకు, వెనక్కి కదలడం, వాటి నుంచి వైబ్రేషన్స్‌ రావడం ద్వారా ప్రేక్షకులు కథలో భాగమై ఉన్నట్టుగా భావిస్తారు.

ఎంఎక్స్‌4డీ (MX4D) ఫార్మాట్‌ కూడా 4DX తరహాలోనే ఉంటుంది. కదిలే సీట్లు, వాతావరణ ఎఫెక్టులతో థియేటర్‌లో సినిమా చూస్తున్నారా, థీమ్‌ పార్క్‌లో రైడ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారా అనే సందేహం కలిగేంత అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.