రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఒక్క రాత్రిలోనే రష్యాపైకి 660 డ్రోన్లు…
ఉక్రెయిన్ భారీ దాడి
ఉక్రెయిన్–రష్యా యుద్ధం మరింత ఉధృతమవుతున్న నేపథ్యంలో రష్యా భూభాగంపై ఇప్పటివరకు అరుదుగా నమోదైన స్థాయిలో డ్రోన్ దాడులు జరిగాయి. మాస్కో ఆధీనంలోని క్రిమియాతో పాటు దేశవ్యాప్తంగా 12 ప్రాంతాలపై ఉక్రెయిన్ వందలాది డ్రోన్లను ప్రయోగించింది. ఒక్క రాత్రిలోనే 660 డ్రోన్లు రష్యా వైపు దూసుకెళ్లినట్లు సమాచారం.
ఈ దాడులన్నింటినీ తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. రాజధాని మాస్కోతో పాటు అజోవ్, నల్ల సముద్ర తీర ప్రాంతాల్లోని నగరాలు, క్రిమియా ఈ దాడుల ప్రధాన లక్ష్యాలుగా మారాయి. మాస్కో నగరంపైకి వచ్చిన 47 డ్రోన్లను కూల్చివేసినట్లు అక్కడి మేయర్ వెల్లడించారు. అయితే ఈ దాడుల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందా అనే వివరాలను ఆయన వెల్లడించలేదు.
నోవోమోస్కోవ్‌స్కీ ప్రాంతంలోని ఒక రసాయన కర్మాగారం, హైడ్రోఎలక్ట్రిక్ ప్లాంట్‌పై కూడా ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు స్థానిక వార్తా నివేదికలు చెబుతున్నాయి. అక్కడ భారీగా మంటలు చెలరేగినట్టు సమాచారం. అయితే ఈ ఘటనలపై రష్యా అధికార వర్గాల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.
ఈ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా గత ఏడాది నుంచి చేపట్టిన శాంతి ప్రయత్నాలు గణనీయమైన ఫలితాలు ఇవ్వకపోవడంతో ఉక్రెయిన్ ఇటీవల నెలల్లో రష్యా సైనిక స్థావరాలు, విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులను మరింతగా పెంచింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ తాజాగా ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధం ముగిసేలా రష్యాపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో 40 రోజుల పాటు కీలక ఆపరేషన్ చేపట్టనున్నాం. ఈ సమయంలో మా చర్యలు అత్యంత ఉద్ధృతంగా ఉంటాయి.
జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే రష్యా భూభాగంపై భారీ డ్రోన్ దాడులు జరగడం గమనార్హం. మరోవైపు రష్యా కూడా క్షిపణి దాడులను ముమ్మరం చేసింది. గత 24 గంటల్లో ఖర్కీవ్ నగరంపై మాస్కో జరిపిన దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అలాగే గత రాత్రి 189 రష్యన్ డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ప్రతిస్పందనగా రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలను మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య ప్రకటించింది. 2027 జూలై 31 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. యుద్ధం ముగింపు దిశగా స్పష్టమైన సంకేతాలు కనిపించకపోవడంతో ఇరుపక్షాల దాడులు, అంతర్జాతీయ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.







