రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: సింధు జలాల ఒప్పందంపై భారత్–పాకిస్థాన్‌ల మధ్య కొనసాగుతున్న వివాదంలో పాకిస్థాన్‌కు ఆర్థికపరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన అంతర్జాతీయ మధ్యవర్తిత్వ విచారణలో భారత్ పాల్గొనకపోవడంతో, ఆ ప్రక్రియకు సంబంధించిన మొత్తం ఖర్చును ప్రస్తుతం పాకిస్థానే భరిస్తోందని సమాచారం.
ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం, హేగ్‌లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వద్ద కొనసాగుతున్న ఈ కేసు కోసం పాకిస్థాన్ ఇప్పటివరకు 6 లక్షల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. విచారణ ముందుకు సాగే కొద్దీ ఈ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని ఆ నివేదికలో పేర్కొంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం మధ్యవర్తిత్వ విచారణల ఖర్చులను భారత్, పాకిస్థాన్‌లు సమానంగా భరించాలి. అయితే భారత్ ఈ ప్రక్రియకు దూరంగా ఉండటంతో, తన వంతు ఖర్చును కూడా ఇస్లామాబాద్‌నే చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
సింధు జలాల ఒప్పందం కింద పశ్చిమ నదులపై భారత్ చేపడుతున్న కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులే ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచాయి. ఈ ప్రాజెక్టులు ఒప్పంద నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ పాకిస్థాన్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. మరోవైపు, ఇలాంటి సాంకేతిక అంశాలను న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ ద్వారానే పరిశీలించాలనే అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేస్తోంది. న్యూట్రల్ ఎక్స్‌పర్ట్ పరిశీలనతో పాటు ఒకేసారి ఆర్బిట్రేషన్ ప్రక్రియను కొనసాగించడం ఒప్పంద స్ఫూర్తికి విరుద్ధమని భారత్ వాదిస్తోంది.
ఈ నేపథ్యంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌కు ఈ కేసును విచారించే అధికారం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ ట్రైబ్యునల్‌ను చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేశారని, దీనివల్ల వెలువడే ఏ తీర్పులనైనా భారత్ చెల్లుబాటు అయ్యినవిగా పరిగణించబోదని ప్రకటించింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనల ప్రకారం, ఒక పక్షం విచారణకు హాజరు కాకపోయినా, ట్రైబ్యునల్‌కు అధికార పరిధి ఉందని భావిస్తే విచారణను కొనసాగించవచ్చు. ఆ నిబంధనల ఆధారంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్, పాకిస్థాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు తనకు అధికారం ఉందని ప్రకటించింది.
ఇదిలా ఉండగా, 2025 ఏప్రిల్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధు జలాల ఒప్పందం అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. సరిహద్దు దాటి జరుగుతున్న ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్థాన్ విశ్వసనీయమైన, శాశ్వత చర్యలు తీసుకునే వరకు ఒప్పందం అమల్లో ఉండదని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం మధ్యవర్తిత్వ ప్రక్రియను కొనసాగిస్తూ, రెండు దేశాల తరఫున చెల్లించాల్సిన ఖర్చులను కూడా తానే భరిస్తోందని సమాచారం.
భారత్ పాల్గొనని పరిస్థితి ఇలాగే కొనసాగితే, సింధు జలాల ఒప్పందంపై జరుగుతున్న ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియకు సంబంధించిన మొత్తం ఖర్చును ఇకపై కూడా పాకిస్థానే భరించాల్సి వచ్చే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.







