రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
బంగారం వెదజల్లే అగ్నిపర్వతం..
ఏడాదికి రూ.18.9 కోట్ల విలువైన పసిడి గాల్లోకి..
అంటార్కిటిక్‌లోని ఎరెబస్ అగ్నిపర్వతం (Mount Erebus).. ఏటా రూ.18.9 కోట్ల విలువైన బంగారం ధూళి గాల్లోకి విరజిమ్ముతున్నట్లు జియోఫిజికల్ పరిశోధనలు వెల్లడించాయి. 1991 నాటి సర్వే ప్రకారం.. రాస్ ద్వీపం సమీపంలో ఉన్న ఎరెబస్ అగ్నిపర్వతం రోజుకు 80 గ్రాముల బంగారు ధూళి (Gold Particles) గాల్లోకి విరజిమ్ముతోంది. ఈ అగ్నిపర్వత లావా నుంచి విడుదలయ్యే వాయువులు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ కణాలను మోసుకెళ్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అవి అంటార్కిటిక్ మంచుపై స్థిరపడటానికి ముందు 1,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని తెలిపారు.
ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌ను ఉపయోగించి.. 60 మైక్రోమీటర్ల వరకు వ్యాసం కలిగి ఉండే ఈ బంగారు స్పటికాలను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. లావాతో పాటు స్వచ్ఛమైన బంగారు సూక్ష్మ స్ఫటికాలను వాతావరణంలోకి ఈ అగ్ని పర్వతం విడుదల చేస్తోందని చెప్పారు. అగ్నిపర్వత వాయువుల (Hot volcanic gases)లో బంగారం దొరకడం పూర్తిగా అసాధారణ విషయమేమీ కాదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. హవాయిలోని కిలావుయా, ఇటలీలోని మౌంట్ ఎట్నా, అలాస్కాలోని ఆగస్టీన్, మెక్సికోలోని ఎల్ చిచోన్ వంటి అగ్నిపర్వతాల వద్ద కూడా స్వల్ప మొత్తంలో బంగారాన్ని గుర్తించామన్నారు.







