అమెరికాలో జాతి, మత వివక్ష మరోసారి భయానక రూపం దాల్చింది. ఉటా రాష్ట్రంలోని ఒక షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న భారతీయ ముస్లింను గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో పొడవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "మీరు ముస్లిమా?" అని ప్రశ్నించిన ఆ వ్యక్తి, "అవును" అనే సమాధానం వచ్చిన వెంటనే దాడికి దిగడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

భారతదేశానికి చెందిన సోహైల్ అనే యువకుడు ఉటా నగరంలోని ఒక షాపింగ్ మాల్‌లో దుకాణంలో ఉద్యోగం చేస్తున్నాడు. శనివారం జరిగిన ఈ ఘటనలో దాదాపు 48 ఏళ్ల వయసున్న వ్యక్తి మాల్‌కు వచ్చి సోహైల్ దగ్గరకు చేరాడు. మొదట అతని ఊరు, పేరు గురించి అడిగి, తరువాత మతం గురించి ప్రశ్నించాడు. సోహైల్ తనను భారతదేశానికి చెందిన ముస్లింగా పరిచయం చేసుకున్న వెంటనే ఆ వ్యక్తి చేతిలో ఉన్న కత్తితో వరుసగా దాడి చేశాడు.

సాక్షుల సమాచారం ప్రకారం, ఆ దుండగుడు సోహైల్‌పై మొత్తం 15 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడిపోయిన సోహైల్ ప్రాణాల కోసం పోరాడుతుండగా, మాల్‌లో ఉన్న ఇతర ఉద్యోగులు, వినియోగదారులు వెంటనే స్పందించి అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అక్కడ అత్యవసర వైద్యం అందుతోంది.

“ఆ వ్యక్తి సోహైల్‌ను ‘ఏ ఊరు’ అని అడిగాడు. దానికి సోహైల్ ‘ఇండియా’ అని, తన పేరు ‘సోహైల్’ అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ‘మీరు ముస్లిమా?’ అని అడిగాడు. సోహైల్ ‘అవును’ అని చెప్పడమే ఆలస్యం, కత్తితో పొడవడం మొదలుపెట్టాడు” అని ఆ భయానక ఘటనను వివరించింది.

దాడి అనంతరం మాల్ నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన దుండగుడిని అక్కడి ప్రజలు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతని పేరు పీటర్ మైఖేల్ లార్సన్ (48) అని గుర్తించారు. అతనికి ముస్లింలపై తీవ్రమైన ద్వేషం ఉండి, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని తిరుగుతూ సోహైల్‌పై దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం లార్సన్ ను సాల్ట్ లేక్ కౌంటీ జైలులో నిర్బంధించారు.

సోహైల్‌కు తీవ్రమైన గాయాలు కావడంతో అనేక శస్త్రచికిత్సలు అవసరమవుతున్నాయి. అతనికి ఇన్సురంచె లేకపోవడంతో వైద్య ఖర్చులు భరించలేని స్థితి ఏర్పడింది. దీనితో అతని స్నేహితురాలు లూనా తరఫున గో ఫండ్ మీ పేజీ ప్రారంభించి విరాళాలు సేకరిస్తున్నారు.

ఈ ఘటన అమెరికాలో ముస్లింలపై ద్వేష నేరాల సమస్యను మరోసారి ముందుకు తెచ్చింది. సోహైల్ ఆరోగ్యం, కుటుంబ పరిస్థితిపై స్థానిక సమాజం ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆన్‌లైన్‌ ద్వారా సహాయం అందిస్తోంది.