రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి..
11 మంది భారతీయుల్లో ఒక్కరు గల్లంతు
ఒమన్ తీరానికి సమీపంలోని హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలో ఆ నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని సురక్షితంగా రక్షించగా, మరో భారతీయుడి జాడ గల్లంతైంది. ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
సైప్రస్ జెండా కింద ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్ గెలాక్సీ నౌకలో మొత్తం 11 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి సమయంలో నౌకలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో సిబ్బంది నౌకను వదిలి ఒక చిన్న లైఫ్‌బోట్ ద్వారా బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో నౌక ఇంజిన్ రూమ్ తీవ్రంగా దెబ్బతింది.
దాడి, మంటల కారణంగా హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పటికే ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంఘటన మరింత ఆందోళనకు దారితీసింది. ఇరాన్‌లోని 140 లక్ష్యాలపై అమెరికా దాడులు జరిపినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై దాడి, భారతీయుల గల్లంతు విషయంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. ఒమన్‌లోని భారత దౌత్య కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తూ, గాలింపు చర్యల్లో అక్కడి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తోంది. గల్లంతైన భారతీయుడి కోసం శోధన కొనసాగుతోంది.
వాణిజ్య నౌక జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై ఒమన్ తీరంలో దాడిచేయడాన్ని మేము ఖండిస్తున్నాం. దీనిలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మందిని రక్షించారు. ఒకరి జాడ గల్లంతైంది. ఒమన్‌లోని మా దౌత్య కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోంది. గాలింపు చర్యల్లో ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటోంది. ఒమన్ ప్రభుత్వం అందించిన సాయానికి ధన్యవాదాలు
అని భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
హర్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్య నౌకాయానానికి కీలక మార్గం. గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు, వాయువు రవాణా ఎక్కువగా ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఇలాంటి ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి ప్రాధాన్యం సంతరించుకుంది.
జీఎఫ్‌ఎస్ గెలాక్సీపై దాడి, భారతీయుల గల్లంతు అంశంపై భారత్ అంతర్జాతీయ వేదికలపై కూడా తన ఆందోళనను వ్యక్తం చేసే అవకాశం ఉందని విదేశాంగ వర్గాలు సూచిస్తున్నాయి. వాణిజ్య నౌకాయాన భద్రత, సముద్ర మార్గాల స్వేచ్ఛాయుత ప్రయాణం కోసం ప్రపంచ దేశాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.







