రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంపై దాడి చేసింది. అక్కడి అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా డ్రోన్ ఫ్లీట్‌లో కీలక భాగాన్ని ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.
ఆ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు
అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, జోర్డాన్‌లలోనూ తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. కువైట్‌లోని అలీ అల్ సేలెం, అహ్మద్ అల్ జాబర్ సైనిక స్థావరాలు, జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్, అలాగే ఖతార్, ఒమన్‌లోని అమెరికా మద్దతు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలోని ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే జోర్డాన్ మాత్రం.. ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, యూఏఈ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖతార్‌లో ఇరాన్ దాడుల సమయంలో శకలాలు పడి ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కువైట్‌లోని ఓ చమురు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన దాడిలో ఓ కార్మికుడు గాయపడినట్లు సమాచారం. ఒమన్‌లోనూ డ్రోన్ దాడుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాలే లక్ష్యం: అమెరికా
మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM).. ఇరాన్‌పై చేపట్టిన తాజా దాడులను సమర్థించుకుంది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ‘‘మేము వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.
హర్ముజ్ మూసివేశామన్న ఇరాన్..
తాజా ఘర్షణలకు ప్రధాన కారణంగా మారింది హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ‘‘హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేదు. అంతర్జాతీయ నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.
షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. అయితే పూర్తిగా నిలిచిపోలేదని సమాచారం. కొన్ని చమురు ట్యాంకర్లు మాత్రం ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది.







