ఖతార్, పాకిస్తాన్, ఒమన్‌పై ఒత్తిడి

అమెరికా, ఇజ్రాయిల్‌లను ప్రధాన శత్రువులుగా భావిస్తున్న ఇరాన్, ఇప్పుడు యుద్ధం ముగిసి శాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తున్న మధ్యవర్తి దేశాలపైనా దాడులు జరుపుతోంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఇరాన్‌ను అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మిగిలే పరిస్థితికి నెడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఖతార్, ఒమన్, పాకిస్తాన్‌లు ప్రస్తుతం ఇరాన్ చర్యల మూల్యం చెల్లించుకుంటున్న దేశాలుగా మారాయి.

గల్ఫ్ ప్రాంతంలో ఖతార్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఆఫ్ఘాన్‌లో తాలిబాన్‌లతో ఒప్పందం కుదిరే ప్రక్రియలో, గాజా యుద్ధం తగ్గుముఖం పడే దశలో ఖతార్ కీలక మధ్యవర్తిత్వ పాత్ర పోషించింది. ప్రస్తుత ఇరాన్ యుద్ధంలో కూడా ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం అయిన Al Udeid ఖతార్‌లోనే ఉండటం, మరోవైపు ఇరాన్‌తో కూడా మిత్ర సంబంధాలు కొనసాగించడం వల్ల ఖతార్‌కు ద్వంద్వ పాత్ర ఏర్పడింది.

అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖతార్‌పై ఇరాన్ పలు మార్లు క్షిపణులు, డ్రోన్ దాడులు జరిపింది. గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా దాడులకు గురైన దేశంగా ఖతార్ పేరు వినిపిస్తోంది. ఈ దాడుల వల్ల ఖతార్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు మధ్యవర్తిగా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ కూడా ఇరాన్ దాడుల తీవ్రతను ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియా–పాకిస్తాన్ మధ్య ఉన్న రక్షణ ఒప్పందం ప్రకారం, సౌదీపై దాడి జరిగితే అది పాకిస్తాన్‌పై దాడిగా పరిగణించి, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇరాన్ సౌదీపై క్షిపణి దాడులు కొనసాగించడం పాకిస్తాన్‌పై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతోంది.

ఇరాన్, సౌదీ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య నలిగిపోతున్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో పాకిస్తాన్, ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్–సౌదీ రక్షణ ఒప్పందాన్ని ఇరాన్ గుర్తుంచుకోవాలని ఆ దేశ మంత్రి Ishaq Dar గుర్తు చేసిన విషయం తెలిసిందే.

ఇరాన్ ఈ విధంగా వ్యవహరించడానికి కారణం ఏమిటన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. తమపై సైనిక చర్యలకు దిగితే యుద్ధం గల్ఫ్ ప్రాంతమంతటా విస్తరిస్తుందనే సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇరాన్ మిత్ర, శత్రువు అనే తేడా లేకుండా అన్ని దేశాలపైనా దాడులు చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా మిత్రదేశాలైన UAE, కువైట్ , ఖతార్, సౌదీ అరేబియా , బహరేన్ లపై దాడులు చేసి, అమెరికాపై ప్రత్యక్ష ఒత్తిడి తీసుకురావాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నదని వారు సూచిస్తున్నారు.

అదే సమయంలో హోర్ముజ్ జలసంధిపై హక్కులు తమకే ఉన్నాయనే సంకేతం ఇవ్వడానికి ఈ మార్గంలో నౌకా రవాణాను అడ్డుకుంటున్న ఇరాన్, గల్ఫ్ సముద్ర రవాణా భద్రతను సవాల్ చేస్తోందని రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు యుద్ధాన్ని మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని, ముఖ్యంగా మధ్యవర్తి, మిత్రదేశాలపై దాడులు కొనసాగితే ఇరాన్ దౌత్య మార్గాలు మూసుకుపోయే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.